టీమిండియానే ఈ సిరీస్‌ గెలవాలి: పాక్‌ క్రికెటర్‌

Shoaib Akhtar Wishes To See Series Full Of Clashes India Vs Australia - Sakshi

ఇస్లామాబాద్‌: మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానేపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. సారథిగా జట్టును ముందుండి నడిపించడమే గాకుండా అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న అతడిని క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ సహా రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి తదితరులు కొనియాడిన సంగతి తెలిసిందే. తాజాగా... పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం రహానేపై ప్రశంసలు కురిపించాడు. ఏమాత్రం హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఉంటూనే అద్భుతం చేసి చూపించాడని కితాబిచ్చాడు. ఘోర పరాభవం ఎదురైన చోటే టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

ఈ మేరకు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌, పేసర్‌ అక్తర్‌ స్పోర్ట్స్‌ చానెల్‌తో మాట్లాడుతూ... ‘‘  ఓరోజు ఉదయం నేను స్కోరు చూసే సరికి 36 పరుగులకే 9 వికెట్లు. టీమిండియా స్కోరు అది. కానీ ఆ తర్వాత అంతా మారిపోయింది. రెండో టెస్టులో భారత జట్టు చూపించిన పట్టుదల అమోఘం. అజింక్య రహానే చాలా సైలెంట్‌గా కనిపిస్తాడు. మైదానంలో హడావుడి చేయడం, అతిగా ప్రవర్తించడం వంటివి ఉండవు. కూల్‌ కెప్టెన్సీతో తనకు రావాల్సిన ఫలితాన్ని రాబట్టుకున్నాడు. అతడి నాయకత్వంలో ఆటగాళ్లంతా ఒక్కసారిగా విజృంభించారు. స్టార్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో కూడా టీమిండియా ఇలా నిలదొక్కుకుందంటే అది కేవలం ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే కాదు.. బెంచ్‌ అందించిన బలం అది. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జట్టు సమిష్టిగా సత్తా చాటింది. భారీ ఓటమి తర్వాత అంత ఘనంగా పునరాగమనం చాటడం టీమిండియా పట్టుదలకు నిదర్శనం’’ అని చెప్పుకొచ్చాడు.(చదవండి: టీమిండియా మా రికార్డును బ్రేక్‌ చేసింది: అక్తర్‌)

అదే విధంగా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ... ‘‘ఓ 10-15 ఏళ్ల క్రితం... ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలోనే ఓ ఉపఖండ జట్టు(భారత్‌, పాకిస్తాన్‌) మట్టికరిపిస్తుందని ఎవరు ఊహించి ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సిరీస్‌ మరింత రసవత్తరంగా సాగాలని నేను కోరుకుంటున్నా. టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నా. వారి పట్టుదల, ధైర్యమే విజయాన్ని చేకూరుస్తుంది’’ అని అక్తర్‌ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. కాగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top