Shamar Joseph Life Journey: శభాష్‌ షామర్‌.. సెక్యూరిటీ గార్డు టూ 'గబ్బా' హీరో

Shamar Josephs journey: From a village by the Canje river to becoming the face of West Indies Hero - Sakshi

దాదాపు రెండేళ్ల క్రితం అతను బతుకుతెరువు కోసం ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే క్రికెట్‌పై పిచ్చి ఈ ఉద్యోగంలో నిలవనీయడం లేదు. ఇలాగే సాగితే తన జీవితం సెక్యూరిటీకే అంకితం అయిపోతుందని అతను భయపడ్డాడు. ఏదో సాహసం చేయాల్సిందేనని భావించాడు. కానీ ఒక్కసారిగా ఇంటి కష్టాలు కళ్ల ముందు నిలిచాయి. అయితే అతడి కలను నెరవేర్చేందుకు కుటుంబం అండగా నిలుస్తూ ధైర్యాన్ని నిపించింది. దాంతో దేనికైనా సిద్ధమే అంటూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెడుతూ తన సాధన కొనసాగించాడు. 

రెండేళ్ల తర్వాత చూస్తే ప్రతిష్ఠాత్మక బ్రిస్బేన్‌ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాటర్లను తన బౌలింగ్‌లో ఒక ఆటాడించాడు. తమకు ఘనమైన రికార్డు ఉన్న గాబా మైదానంలో ఆసీస్‌ ఆటగాళ్లు అతని బౌలింగ్‌ ముందు తలవంచారు. వేగవంతమైన బంతులతో చెలరేగిపోతుంటే జవాబు ఇవ్వలేక బ్యాట్లు ఎత్తేశారు. ఫలితంగా వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయం. 24 ఏళ్ల ఆ బౌలర్‌ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఎక్కడో గయానా అడవుల్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చిన ఆ కుర్రాడే పేస్‌ బౌలర్‌ షామర్‌ జోసెఫ్‌. అతని నేపథ్యం, ఆపై ఎదిగిన తీరు అసమానం, స్ఫూర్తిదాయకం. 

జనవరి 17, 2024...అంతర్జాతీయ క్రికెట్‌లో షామర్‌ జోసెఫ్‌ అరంగేట్రం చేసిన రోజు. అడిలైడ్‌ మైదానంలో తీవ్ర ఒత్తిడిలో తన మొదటి ఓవర్‌ వేసేందుకు అతను తన బౌలింగ్‌ రనప్‌ మొదలు పెట్టాడు. ఎదురుగా బ్యాటింగ్‌ చేస్తున్నది టెస్టు క్రికెట్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడైన స్టీవ్‌ స్మిత్‌. గుడ్‌ లెంగ్త్‌లో ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతిని డిఫెన్స్‌ ఆడబోయిన స్మిత్‌ దానిని నియంత్రించలేక మూడో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు.

అంతే... ఒక్కసారిగా విండీస్‌ శిబిరంలో సంబరాలు. టెస్టుల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్‌ తీసిన అత్యంత అరుదైన ఆటగాళ్ల జాబితాలో షామర్‌ చేరాడు. ఈ క్షణాన్ని ఫోటో ఫ్రేమ్‌ చేసిన తన ఇంట్లో పెట్టుకుంటానని అతను ప్రకటించాడు. అయితే ఆ ఆనందం అంతటితో ఆగిపోలేదు. మరో 11 రోజుల తర్వాత అది రెట్టింపైంది. 216 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 113 పరుగులకు 2 వికెట్లతో పటిష్ఠ స్థితిలో నిలిచిన దశలో షామర్‌ స్పెల్‌ కంగారూలను కుప్పకూల్చింది.

విరామం లేకుండా బౌలింగ్‌ చేసిన అతను 7 వికెట్లతో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యం కనబర్చాడు. ఎప్పుడో షామర్‌ పుట్టక ముందే 27 ఏళ్ల క్రితం ఆసీస్‌ను వారి సొంతగడ్డపై విండీస్‌ ఆఖరిసారిగా ఓడించింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఒక గెలుపు. ఇన్నాళ్లుగా ఒక విజయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన నాటి దిగ్గజాలు బ్రియాన్‌ లారా, కార్ల్‌ హూపర్‌ కన్నీళ్లపర్యంతమవగా షామర్‌ వారి ముందు ఒక అద్భుతం చేసి చూపించాడు.

సాధారణంగా తమను ఓడించిన ప్రత్యర్థులపై కసితో ఆమడ దూరం ఉండి ఆగ్రహాన్ని ప్రదర్శించే ఆసీస్‌ ఆటగాళ్లు కూడా బీరు గ్లాసులతో వేడుకల్లో జత కలిశారు. ఎందుకంటే ఈ విజయం విలువేమిటో అందరికీ తెలియడమే కాదు, షామర్‌ జోసెఫ్‌ గురించి తెలుసుకున్న తర్వాత వారందరూ మనస్ఫూర్తిగా అభినందించారు.

కట్టెలు కొట్టడంతో మొదలై...
గయానా దేశంలో న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌ ఒక చిన్న పట్టణం. దాదాపు 20 వేల జనాభా ఉంటుంది. బెర్బిస్‌ నదీ తీరంలో ఈ పట్టణం ఉంటుంది. బెర్బిస్‌ ఉప నది కాంజే ద్వారా అక్కడి నుంచి దాదాపు 225 కిలో మీటర్లు  పడవలో రెండు రోజుల పాటు ప్రయాణిస్తే, బరాకారా అనే చిన్న ఊరు వస్తుంది. జనాభా దాదాపు 400 మంది. ఇటీవలి వరకు అక్కడ మొబైల్‌ ఫోన్‌లు, ఇంటర్‌నెట్‌ అనే పేరు కూడా తెలీదు. ఊర్లో అందరికీ ఒకటే వృత్తి.. అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టడం, వాటిని దుంగలుగా కట్టకట్టి కాంజే నది ద్వారానే న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌ వరకు చేర్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం.

షామర్‌ కుటుంబం కూడా అదే పనిలో ఉంది. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ల కుటుంబంలో అతను ఒకడు. అలాగే జీవితం సాగిపోతున్న సమయంలో అనూహ్యం జరిగింది. అడవిలో పని చేస్తున్న క్రమంలో ఒక పెద్ద జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అర క్షణం తేడాతో షామర్‌ చావునుంచి తప్పించుకున్నాడు. దాంతో ఈ పనిని మానేయాలని అతను వెంటనే నిర్ణయించుకున్నాడు.

అయితే ఉపాధి కోసం న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌కే వెళ్లిపోయాడు. ముందు ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో లేబర్‌గా పని చేశాడు. అక్కడ ఇబ్బందులు రావడంతో ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. అప్పటికే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్న షామర్‌ టేప్‌ బాల్‌తో బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేసేవాడు. అయితే వరుసగా 12 గంటల బ్యాంక్‌ ఉద్యోగం, అలసట కారణంగా ఆదివారాలు కూడా ఆడే అవకాశం లేకపోయేది. దాంతో ఒక గందరగోళ స్థితిలోకి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో కుటుంబం మద్దతుగా నిలిచి ప్రోత్సహించింది. ‘నువ్వు ఇష్టపడే చోట కష్టపడు’ అంటూ ఒక ప్రయత్నం చేయమని, మిగతావారంతా కుటుంబ బాధ్యతలు తీసుకుంటామని అండగా నిలిచారు. దాంతో షామర్‌కు స్వేచ్ఛ దొరికినట్లయింది. 
అండగా అందరూ...
టేప్‌ బాల్, రబ్బర్‌ బాల్, ప్లాస్టిక్‌ బాల్, నిమ్మకాయలు, జామకాయలు.. ఇలా అన్నింటిలోనూ షామర్‌కు క్రికెట్‌ బంతే కనిపించింది. బౌలింగ్‌ను ఇష్టపడిన అతను వీటన్నంటితో ఆడుతూనే వచ్చాడు. టీవీల్లో, పోస్టర్లలో కనిపించే నాటి దిగ్గజాలు ఆంబ్రోస్, వాల్ష్‌లపై మొదటినుంచీ అభిమానాన్ని పెంచుకొని వారినే అనుకరించే ప్రయత్నం చేశాడు. కష్టపడేవారికే అదృష్టం కూడా అండగా నిలుస్తుందనేది వాస్తవం.

షామర్‌ విషయంలోనూ అది నిజమైంది. వేర్వేరు దశల్లో ఎంతోమంది షామర్‌కు సహాయం చేయడంతో అతను ముందంజ వేయగలిగాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టి అవకాశం దొరికిన చోటల్లా తనలోని సహజమైన బౌలింగ్‌ ప్రతిభను షామర్‌ ప్రదర్శించాడు. ఒక రోజు విండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియా షెఫర్డ్‌ దృష్టి అతనిపై పడింది.

ఇతనిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన షెఫర్డ్‌ తనకు సన్నిహితులైన అందరి వద్ద షామర్‌ గురించి చెబుతూ వచ్చాడు. అదే అతనికి వరుసగా అవకాశాలు కల్పించింది. గయానా కోచ్‌ ఎసన్‌ క్రాన్‌డన్, మాజీ కెప్టెన్‌ లియాన్‌ జాన్సన్, గయానా సీపీఎల్‌ జట్టు ప్రతిభాన్వేషి ప్రసన్న అగోరమ్‌...ఇలా అందరూ షామర్‌కు అండగా నిలిచేవారే. ముఖ్యంగా తనకు తల్లీ, తండ్రి లాంటివాడు అని షామర్‌ చెప్పుకున్న ప్రసన్న కారణంగానే తొలిసారి పెద్ద స్థాయిలో అతనికి క్రికెట్‌ టోర్నీ అవకాశం దక్కింది.

ముందుగా డివిజన్‌ స్థాయి క్రికెట్‌లో బరిలోకి దిగి సత్తా చాటడంతో ఆ తర్వాత కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తొలిసారి చాన్స్‌ వెతుక్కుంటూ వచ్చింది. తన పదునైన పేస్‌ బౌలింగ్‌ను మాత్రమే నమ్ముతున్న షామర్‌కు మరో సిఫారసు అవసరం లేకుండా పోయింది. సీపీఎల్‌లో చెలరేగడంతో గయానా తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అవకాశం దక్కింది. ఏడాది తిరిగేలోగా వెస్టిండీస్‌ సీనియర్‌ జట్టులోకి ఎంపిక కావడం అతని పురోగతిని చూపిస్తోంది. 

ప్రతికూల పరిస్థితిని జయించి...
షామర్‌ను హీరోగా మార్చిన బ్రిస్బేన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్‌ చేయగలగడమే అనూహ్యం. అంతకు ముందు రోజు బ్యాటింగ్‌ చేస్తుండగా స్టార్క్‌ వేసిన యార్కర్‌కు అతని కాలి వేలికి తీవ్ర గాయమైంది. దాంతో మ్యాచ్‌ బరిలోకి దిగడమే సందేహంగా మారింది. అందుకే జట్టుతో పాటు మైదానంలోకి టీమ్‌ డ్రెస్‌తో కాకుండా క్యాజువల్‌గా వచ్చేశాడు. అయితే డాక్టర్‌ నొప్పి నివారణ ఇంజక్షన్‌లు ఇచ్చిన తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన కలిగింది. తన జట్టును ఓటమి నుంచి రక్షించేందుకు ఏదైనా చేయగలననే నమ్మకంతో అతను బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు.

ఏం జరిగినా ఆఖరి వికెట్‌ పడే వరకు నేను బౌలింగ్‌ ఆపను అంటూ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌కు చెప్పాడు. దాంతో హడావిడిగా సహాయక సిబ్బంది డ్రెస్‌ కోసం హోటల్‌ గదికి పరుగెత్తగా సహచరుడు జాకరీ మెకస్కీ జెర్సీని తీసుకున్న షామర్‌ నంబర్‌పై స్టికర్‌ అంటించి అంపైర్‌ అనుమతితో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు ముగిశాయి. చక్కగా ఆడుతున్న జట్టు విజయం దిశగా వెళుతోంది. 29వ ఓవర్‌తో షామర్‌ తన బౌలింగ్‌ను మొదలు పెట్టాడు. అంతే...కెప్టెన్‌కు మాట ఇచ్చినట్లుగా వరుసగా 11.5 ఓవర్లు వేసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు.

ఒకటి, రెండు, మూడు.. ఇలా మొదలై చివరకు ఏడో వికెట్‌కు విండీస్‌ను గెలిపించి విజయనాదం చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. టెస్టు క్రికెటర్‌గా షామర్‌ ఆట ఇప్పుడే మొదలైంది. రాగానే సంచలనం సృష్టించినా, ఆటగాడిగా ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అవరోధాలను దాటి, గాయాలను అధిగమించి పెద్ద కెరీర్‌ నిర్మించుకోవడం అంత సులువు కాదు.

పైగా విండీస్‌లాంటి బలహీనమైన జట్టు తరఫున ఎప్పుడూ అద్భుతాలు సాధ్యం కావు. అయితే షామర్‌లో ప్రతిభను చూస్తే అతను ఈ ఒక్క ఘనతకే పరిమితం కాడనేది అంచనా. అన్నింటినీ మించి ఫలితాలను పక్కన పెడితే అతను ప్రస్తుతం సగర్వంగా నిలిచేందుకు సాగించిన ప్రస్థానం మాత్రం ఆటల్లో ఎదగాలనుకునే అందరికీ ప్రేరణ ఇస్తుందనేది మాత్రం వాస్తవం. 
∙మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top