
అక్టోబర్ 2 నుంచి భారత్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్ జట్టుకు (West Indies) భారీ ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ స్పీడ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
అతని స్థానంలో 22 ఏళ్ల బార్బడోస్ ఆల్‌రౌండర్ జోహాన్ లేన్‌ను (Johann Layne) ఎంపిక చేశారు విండీస్ సెలెక్టర్లు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. జోసఫ్ గాయం వివరాలు వెల్లడించనప్పటికీ.. అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు అతని పేరు మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి.
26 ఏళ్ల షమార్ జోసఫ్ ఇటీవలికాలంలో విండీస్ కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2024లో టెస్ట్ అరంగేట్రం చేసి, ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. షమార్ యార్కర్లు, బౌన్సర్లు, అనూహ్య లైన్ అండ్ లెంగ్త్ అతన్ని ఒక్కసారిగా స్టార్‌గా మార్చాయి. అతని అరంగేట్రం బౌలింగ్ స్పెల్‌ను "ఫైర్ అండ్ ఫోకస్" అని విశ్లేషకులు అభివర్ణించారు.
షమార్ ఇప్పటివరకు విండీస్ తరఫున 11 టెస్ట్‌లు, 6 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 70 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో షమార్ పేరిట 4 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి.
షమార్ స్థానంలో భారత పర్యటనకు ఎంపికైన జోహాన్ లేన్ విషయానికొస్తే.. లేన్ బార్బడోస్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను.. 32 ఇన్నింగ్స్‌లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 495 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 66 వికెట్లు తీశాడు. ప్రస్తుతం లేన్ బౌలింగ్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని వెస్టిండీస్ సెలెక్టర్లు అతన్ని భారత పర్యటనకు ఎంపిక చేశారు.
చదవండి: Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు