
జమైకా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తొలి రోజు పైచేయి సాధించింది. ఆ జట్టు పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. ఫలితంగా ఆసీస్ 225 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసఫ్ 4, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆదిలో సజావుగానే సాగింది.
28 పరుగులకే తొలి వికెట్ (కొన్‌స్టాస్ (17), 68 పరుగులకే రెండో వికెట్ (ఖ్వాజా (23)) కోల్పోయినా.. గ్రీన్ (46), స్మిత్ (48) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే గ్రీన్ ఔటైన తర్వాత ఆసీస్ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు, టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
హెడ్ (20) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఆండర్సన్ ఫిలిప్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ బాట పట్టించాడు. వెబ్‌స్టర్ 1, అలెక్స్ క్యారీ 21, కమిన్స్ 24, స్టార్క్ 0, బోలాండ్ 5 (నాటౌట్), హాజిల్‌వుడ్ 4 పరుగులు చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ కెవియన్ ఆండర్సన్‌ను (3) మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (8), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 209 పరుగులు వెనకుపడి ఉంది.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో ఆసీస్ అద్భుత విజయాలు సాధించింది. నామమాత్రంగా సాగుతున్న చివరి మ్యాచ్‌లో తొలి రోజు విండీస్ పైచేయి సాధించడం విశేషం.