లండన్: ఏడాది క్రితం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. కౌంటీ క్రికెట్‌లో సర్రే తరఫున ఆడుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. సీజన్‌లో అతను ఆడిన ఈ ఏకైక నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్‌లో (సోమర్సెట్‌తో) షకీబ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 63.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు.
అలసిపోయాను..
అయితే తీవ్ర అలసట వల్ల ఉద్దేశపూర్వకంగానే తాను ‘చకింగ్’కు పాల్పడ్డానని, అంపైర్లు తనను బౌలింగ్ నుంచి తప్పించాలని కోరుకున్నట్లు షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) వెల్లడించాడు. ‘ఆ ఒక్క మ్యాచ్‌లోనే నేను దాదాపు 70 ఓవర్లు బౌలింగ్ చేశాను. నేను ఆడిన టెస్టుల్లో కూడా ఎప్పుడూ ఇన్ని ఓవర్లు వేయలేదు.
ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ (BAN Vs PAK)తో రెండు టెస్టులు ఆడి వచ్చాను. చాలా అలసిపోయాను. అందుకే కావాలనే అలా సందేహాస్పద రీతిలో బౌలింగ్ చేస్తూ పోయాను. అంపైర్లు ఎలాంటి హెచ్చరిక కూడా లేకుండా నన్ను బౌలింగ్ నుంచి తప్పించారు. ఆ తర్వాత జరిగిన పరీక్షలో కూడా నేను విఫలమయ్యాను.
మరోసారి సర్రేకు వెళ్లిపోయాను
అనంతరం మళ్లీ రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసి సాధారణ స్థితికి రావడంతో మరోసారి సర్రేకు వెళ్లిపోయాను’ అని షకీబ్ గుర్తు చేసుకున్నాడు. సర్రే మ్యాచ్ తదనంతర పరిణామాల్లో సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా ముందుగా బంగ్లా క్రికెట్ బోర్డు, ఆపై ఐసీసీ కూడా షకీబ్‌పై నిషేధం విధించాయి.
అయితే బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించి తొలి రెండు పరీక్షల్లో విఫలమైన షకీబ్...మూడో పరీక్షలో మాత్రం సఫలమయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ బౌలింగ్ చేసేందుకు అతనికి అనుమతి లభించింది.
రాజకీయ పరిణామాల నేపథ్యంలో
కానీ బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అతడిని జాతీయ జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే, తాను పూర్తిస్థాయిలో రిటైర్ కాలేదని.. సొంత ప్రజల ముందు ఆడి ఆటకు స్వస్తి పలకాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.


