
డబ్లిన్ వేదికగా ఇంగ్లండ్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (సెప్టెంబర్ 19) జరగాల్సిన రెండో టీ20 వర్షార్పణం అయ్యింది. భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని చివరి టీ20 డబ్లిన్ వేదికగానే సెప్టెంబర్ 21న జరుగనుంది.
తొలి మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అంచనాలకు మించి రాణించి భారీ స్కోర్ చేసింది. హ్యారీ టెక్టార్ (36 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (34), రాస్ అదైర్ (26) కూడా సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్, డాసన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఫిల్ సాల్ట్ (46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు) తొలి బంతి నుంచే చెలరేగడంతో మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (10 బంతుల్లో 28), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 24), సామ్ కర్రన్ (15 బంతుల్లో 27) కూడా రాణించారు. ఐరిష్ బౌలర్లలో హంఫ్రేస్, హ్యూమ్ తలో 2, హ్యారీ టెక్టార్, గెరాత్ డెలానీ చెరో వికెట్ తీశారు.