
చాంగ్జౌ: భారత అగ్ర శ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 13–21, 17–21తో మలేసియాకు చెందిన రెండో సీడ్ ఆరోన్ చియా–సో వుయి యిక్ ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది.
2022 ప్రపంచ చాంపియన్ జోడీ ఆరోన్–సో వుయి మ్యాచ్ ఆరంభం నుంచే పట్టుదలగా ఆడటంతో భారత షట్లర్లకు పుంజుకునే అవకాశం లేకపోయింది. ఆసియా క్రీడల చాంపియన్ జోడీ అయిన సాత్విక్–చిరాగ్‌లకు మలేసియన్ జంట కొరకరాని కొయ్యగా మారింది.
ఇప్పటివరకు 14 సార్లు ఈ రెండు జోడీలు పోటీపడగా ఏకంగా 11 సార్లు మలేసియన్ జంటే గెలుపొందింది. భారత జోడీ 3 సార్లు గెలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో భారత షట్లర్ల జోడీ నిలకడగా రాణిస్తోంది. ఇండియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, మలేసియా ఓపెన్‌లలోనూ సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి ప్రవేశించింది.