రూ. 17.5 కోట్లు: ఐపీఎల్‌కు దూరంగా ఉండు.. అప్పుడే మేటి క్రికెటర్‌గా! | Sacrifice IPL To Play Test Cricket Consistently?: Brad Haddin Advice To Cameron Green - Sakshi
Sakshi News home page

IPL 2024: ఐపీఎల్‌కు దూరంగా ఉండు.. అప్పుడే మేటి క్రికెటర్‌గా: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ సలహా

Published Tue, Dec 5 2023 5:25 PM

Sacrifice IPL To Play Test Cricket Consistently: Brad Haddin Advice To Green - Sakshi

మేటి టెస్టు క్రికెటర్‌గా ఎదగాలంటే కామెరాన్‌ గ్రీన్‌ కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హాడిన్‌ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు కొన్నాళ్లు దూరంగా ఉండాలని సూచించాడు. సంప్రదాయ క్రికెట్‌పై మరింతగా దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అభిప్రాయపడ్డాడు.

కాగా ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను గతేడాది ఐపీఎల్‌ వేలంలో ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ కోసం ఏకంగా.. రికార్డు స్థాయిలో 17. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 

అయితే, ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తంలో అతడు 16 మ్యాచ్‌లాడి 452 పరుగలు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ గ్రీన్‌ను ఆర్సీబీకి ట్రేడ్‌ చేసింది. 

ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాడిన్‌.. కామెరాన్‌ గ్రీన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఫాస్ట్‌బౌలర్లు కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, స్టార్క్‌.. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నవాళ్లే. ఇప్పుడు కామెరాన్‌ గ్రీన్‌ కూడా అదే పనిచేస్తే బాగుంటుంది.

పని ఒత్తిడి ఎక్కువగా ఉందనుకుంటే.. అతడు టెస్టు క్రికెట్‌ కోసం ఐపీఎల్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది’’ అని ఫాక్స్‌ క్రికెట్‌తో హాడిన్‌ వ్యాఖ్యానించాడు. గ్రీన్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని.. ఆస్ట్రేలియా తరఫున మేటి క్రికెటర్‌గా ఎదగాలంటే ఇలాంటివి తప్పవని బ్రాడ్‌ హాడిన్‌ అభిప్రాయపడ్డాడు. 

ఇదిలా ఉంటే.. భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియాను ఓడించి ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఈ మ్యాచ్‌ ఆడిన తుది జట్టులో కామెరాన్‌ గ్రీన్‌కు స్థానం దక్కలేదు.

Advertisement
Advertisement