శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత శతకంతో మెరిశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డర్బన్ వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ కుదేలైన వేళ బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బవుమానే ఆదుకున్నాడు
ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(9), టోనీ డి జోర్జి(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతను భుజాన వేసుకున్న బవుమా 117 బంతులాడి 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో టెయిలండర్ కేశవ్ మహరాజ్(24) ఒక్కడే 20 పరుగుల మార్కు దాటాడు.
లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార మూడేసి వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, సౌతాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎక్కువ సేపు ఉండలేదు.
42 పరుగులకే లంక ఆలౌట్
ఆతిథ్య జట్టు పేసర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కేవలం 42 పరుగులకే ధనంజయ డి సిల్వ బృందం కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ సాధించిన 13 పరుగులే టాప్ స్కోర్. ఐదుగురేమో డకౌట్.
ఫలితంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ టోనీ 17 పరుగులకే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 47 రన్స్‌తో రాణించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 15 పరుగులకే అవుట్ కాగా.. స్టబ్స్, బవుమా మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.
స్టబ్స్, బవుమా శతకాలు.. లంకకు భారీ టార్గెట్
స్టబ్స్ 221 బంతుల్లో 122 పరుగులు సాధించగా.. బవుమా 228 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి శతకాల వల్ల సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
ఇదిలా ఉంటే.. టెస్టుల్లో తెంబా బవుమాకు ఇది మూడో సెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం తద్వారా అతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సెంచరీ చేసిన సౌతాఫ్రికా మూడో కెప్టెన్‌గా నిలిచాడు. బవుమా కంటే ముందు షాన్ పొలాక్, హషీం ఆమ్లా మాత్రమే సారథి హోదాలో లంకపై శతకం సాధించారు.
శ్రీలంకతో మ్యాచ్‌లో శతక్కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్లు
👉షాన్ పొలాక్- సెంచూరియన్- 2001- 111 పరుగులు
👉హషీం ఆమ్లా- కొలంబో- 2014- 139 పరుగులు(నాటౌట్)
👉తెంబా బవుమా- డర్బన్- 113 పరుగులు.
చదవండి: ‘అతడిని లారా, సచిన్ అంటూ ఆకాశానికెత్తారు.. ఇలాంటి షాక్ తగిలితేనైనా.. కాస్త’
Comments
Please login to add a commentAdd a comment