డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఐదో విజయం
61 పరుగులతో గుజరాత్‌పై గెలుపు
మెరిపించిన గౌతమి నాయక్
కూల్చేసిన సయాలీ, డిక్లెర్క్
వడోదర: బెంగళూరు... అదే జోరు! నవీ ముంబైలో ఇప్పటికే ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఇలా డబ్ల్యూపీఎల్ ప్రత్యర్థులన్నింటిపై విజయాలు సాధించింది. ఇప్పుడు వేదిక వడోదరకు మారినా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తీరేం మారలేదు! రెండో రౌండ్ విజయాలనూ మొదలుపెట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సోమవారం జరిగిన పోరులో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది.
వరుసగా ఐదో విజయంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గౌతమి నాయక్ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్స్) దంచేసింది. రిచా ఘోష్ (20 బంతుల్లో 27; 3 సిక్స్‌లు) వేగంగా పరుగులు చేసింది. స్మృతి మంధాన (23 బంతుల్లో 26; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది.
జెయింట్స్ బౌలర్లలో కాశ్వీ గౌతమ్, ఆష్లే గార్డ్‌నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులే చేయగలిగింది. కెపె్టన్ ఆష్లే గార్డ్‌నర్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిగా పోరాడింది. సయాలీ సత్‌గరే (3/21), నదిన్ డిక్లెర్క్ (2/17) చావుదెబ్బ తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) గార్డ్‌నర్ (బి) రేణుక 1; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్‌నర్ 26; జార్జియా వోల్ (బి) కాశ్వీ 1; గౌతమి (బి) గార్డ్‌నర్ 73; రిచా ఘోష్ (సి) గార్డ్‌నర్ (బి) సోఫీ డివైన్ 27; డిక్లెర్క్ (నాటౌట్) 4; రాధ (సి) భారతి (బి) కాశ్వీ 17; శ్రేయాంక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1–2, 2–9, 3–69, 4–138, 5–142, 6–170.
బౌలింగ్: రేణుక 4–0–23–1, కాశ్వీ గౌతమ్ 4–0–38–2, అష్లే గార్డ్‌నర్ 4–0–43–2, హ్యాపీ కుమారి 1–0–10–0, సోఫీ డివైన్ 4–0–25–1, జార్జియా వేర్‌హమ్ 1–0–13–0, తనూజ 2–0–20–0.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (బి) సయాలీ 3; సోఫీ డివైన్ (సి) వోల్ (బి) సయాలీ 0; అనుష్క (సి) రాధ (బి) డిక్లెర్క్ 18; కనిక (బి) బెల్ 0; ఆష్లే గార్డ్‌నర్ (సి) రావత్ (బి) సయాలీ 54; కాశ్వీ (బి) రాధ 4; జార్జియా వేర్‌హమ్ (సి) సయాలీ (బి) డిక్లెర్క్ 2; భారతి (సి) హారిస్ (బి) శ్రేయాంక 14; తనూజ (నాటౌట్) 11; రేణుక (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 117.
వికెట్ల పతనం: 1–3, 2–4, 3–5, 4–34, 5–48, 6–56, 7–97, 8–103.
బౌలింగ్: లారెన్ బెల్ 4–1–23–1, సయాలీ 4–0–21–3, డిక్లెర్క్ 4–0–17–2, రాధ యాదవ్ 4–0–34–1, శ్రేయాంక 4–0–19–1.


