
మూడో ర్యాంక్‌లో భారత కెప్టెన్
టాప్–10లో నలుగురు భారత క్రికెటర్లు
శుబ్‌మన్ గిల్ అగ్రస్థానం పటిష్టం
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిండియా కెప్టెన్ ఫైనల్లో చక్కటి ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు మూడోసారి ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న రోహిత్ రెండు ర్యాంక్‌లు మెరుగు పర్చుకొని 756 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (784 పాయింట్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టాప్–10లో మొత్తం నలుగురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో 218 పరుగులు చేసి ఆకట్టుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (736 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంక్‌లో నిలవగా... మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (704 పాయింట్లు) 8వ ర్యాంక్‌లో స్థిరంగా కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 14 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరగా... డారిల్ మిషెల్ ఒక స్థానం మెరుగు పర్చుకొని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (650 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి భారత్ తరఫున అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌లో నిలిచాడు. రవీంద్ర జడేజా (616 పాయింట్లు) కూడా మూడు స్థానాలు మెరుగు పరుచుకొని పదో ర్యాంక్‌కు చేరాడు.
న్యూజిలాండ్ సారథి సాంట్నర్ (657 పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరగా... శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తీక్షణ (680 పాయింట్లు) ‘టాప్’ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా (10వ ర్యాంక్) ఒక్కడే టాప్–10లో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment