
కీలక విషయాలు వెల్లడించిన బీసీసీఐ వర్గాలు
‘వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్‌మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ఆ ప్రమాదం!
ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్‌రూమ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.
అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్‌కు తను కెప్టెన్‌గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.
అంతా గంభీర్ ఆధీనంలోనే..
అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్‌లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.
గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలు
నిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లోనూ జస్‌ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్‌కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.
త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికే
కానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.
చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం