‘అందుకే సూపర్‌ ఓవర్లో అతడిని పంపించాం’ | Rishabh Pant Reveals Reason Behind Why He Sent Out Of Form Pooran In Super Over Vs KKR, Read Story For More Details | Sakshi
Sakshi News home page

LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం

Apr 27 2026 8:41 AM | Updated on Apr 27 2026 10:14 AM

Rishabh Pant Reveals Why Sent out of form Pooran in Super Over vs KKR

రిషభ్‌ పంత్‌ (PC: BCCI)

ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వైఫల్యం కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రిషభ్‌ సేన ఓటమిపాలైంది. ఏకనా స్టేడియంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇరుజట్లు సమానంగా 155 పరుగులు సాధించాయి. ఈ క్రమంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. లక్నో ఓటమి పాలైంది.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా... 
‘సూపర్‌ ఓవర్‌’లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో మూడు బంతుల్లో ఒక్కపరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వేసిన తొలి బంతికే నికోలస్‌ పూరన్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ కాగా... బౌండరీ వద్ద పావెల్, రింకూ సింగ్‌ పట్టిన చక్కటి రిలే క్యాచ్‌కు ఐడెన్‌ మార్క్‌రమ్‌ (0) వెనుదిరిగాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (1 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.

అంతా రింకూ మయం
ఇక రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి బంతికే గెలుపు ఖాతాలో వేసుకుంది. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రింకూ (4 నాటౌట్‌) తొలి బంతికే ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్‌ ఓవర్‌లో నాలుగు పరుగులు ఇలా... కోల్‌కతా విజయంలో ఎక్కడ చూసిన రింకూ సింగ్‌ ప్రతిభే ప్రస్ఫుటించింది. అతడికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

అతడిని ఎలా ఆడిస్తారు?
మరోవైపు.. ఫామ్‌లో లేని నికోలస్‌ పూరన్‌ను సూపర్‌ ఓవర్లో ఆడించడం పట్ల లక్నో నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందించిన తీరు కూడా వైరల్‌గా మారింది. ‘‘మాకు కచ్చితంగా విరామం కావాలి. మళ్లీ సరికొత్తగా తిరిగివస్తాం. ఇలాంటి మ్యాచ్‌లలో ఒత్తిడి సహజం.

అయితే, మేము దీనిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు. అంతర్గతంగా కూర్చుని చర్చిస్తాం. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఇది సమిష్టి వైఫల్యం. కాబట్టి జట్టులోని ప్రతి ఒక్కరు ఇందుకు జవాబుదారీగా ఉండాల్సిందే.

పంత్‌ స్పందన ఇదే
ఇక పూరన్‌ విషయంలోనూ మేమంతా కలిసికట్టుగానే నిర్ణయం తీసుకున్నాం. సూపర్‌ ఓవర్లో ఎవరిని పంపించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నిక్కీ పేరునే సూచించారు. అతడు ఇప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నిక్కీ వంటి స్టార్లపై నమ్మకం ఉంచాలి.

అయితే, ఇక్కడ మా వ్యూహం ఫలించలేదు. మ్యాచ్‌లో సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. కానీ ఈరోజు మాకు అంతగా కలిసిరాలేదు. అయితే, విరామం తర్వాత మళ్లీ సరికొత్తగా తిరిగివస్తామనే నమ్మకం ఉంది’’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌ 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. పంత్‌ 38 బంతుల్లో 42 పరుగులు రాబట్టగలిగాడు.  

చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'    

Advertisement
 
Advertisement
Advertisement