
క్రికెట్‌లో రికార్డుల రారాజు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విరాట్ కోహ్లి. ఈ బ్యాటింగ్ దిగ్గజం మరో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ బిరుదుకు పూర్తి న్యాయం జరగాలంటే విరాట్ మరో రెండు భారీ రికార్డులు బద్దలు కొట్టాల్సి ఉంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకుంటే, విరాట్ ఇదివరకే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజాగా విరాట్ వన్డే రిటైర్మెంట్‌పై కూడా ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పైగా అతడి వయసు కూడా పైబడుతుంది.
ఈ పరిస్థితుల్లో విరాట్ సచిన్ ఖాతాలో ఉన్న ఆ రెండు భారీ రికార్డులను బద్దలు కొట్టడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఆ రికార్డులకు విరాట్ నుంచి ముప్పు తప్పినట్లే అనుకోవాలి. ఇంతకీ ఆ రెండు రికార్డులు ఏవంటే.. మొదటిది వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు. రెండవది అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సెంచరీల రికార్డు.
ప్రస్తుతం ఈ రెండు రికార్డులు విరాట్ కనుచూపుమేరల్లో కూడా లేవు. నాలుగైదేళ్ల కిందట ఈ రికార్డులను విరాట్ సులువుగా బద్దలు కొడతాడని అనిపించింది. అయితే గత కొంతకాలంగా విరాట్ నెమ్మదిపడటంతో ఈ రికార్డులు పరిధి దాటిపోయాయి. విరాట్‌కు వీటికి దూరం పెరిగిపోయింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ రికార్డులు అందని ద్రాక్షాల్లా మిగిలిపోవడం ఖాయమని అనిపిస్తుంది. ఇదే జరిగితే ఆ రెండు భారీ రికార్డులు సచిన్ ఖాతాలోనే సేఫ్‌గా ఉంటాయి. వాటిని సమీప భవిష్యత్తులో కూడా ఎవరూ బద్దలు కొట్టలేరు.
వన్డేల్లో అత్యధిక పరుగులు
సచిన్ ఖాతాలో ఉన్న ఈ రికార్డును (18426) చేరుకోవాలంటే విరాట్ మరో 4245 పరుగులు చేయాలి. విరాట్ వయసు దృష్ట్యా ఇది అసంభవమనే చెప్పాలి. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14181 పరుగులు ఉన్నాయి. మహా అయితే అతడు మరో 50 లేదా 60 వన్డేలు ఆడతాడు. ఈ మ్యాచ్‌ల్లో 4000 పైచిలుకు పరుగులు సాధించడం అసాధ్యం.
100 సెంచరీలు
ప్రపంచ క్రికెట్‌లో అసాధ్యంగా కనిపించే ఈ రికార్డును సచిన్ నెలకొల్పాడు. నాలుగైదేళ్ల కిందటి వరకు ఈ రికార్డును విరాట్ సాధిస్తాడనే నమ్మకముండేది. అయితే విరాట్ గత కొంతకాలంగా నెమ్మదించడంతో ఈ రికార్డుకు దూరం పెరిగింది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 82 సెంచరీలు ఉన్నాయి.
సచిన్ రికార్డును సమం చేయాలన్నా విరాట్ మరో 18 సెంచరీలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమనే చెప్పాలి. ఈ లెక్కన పై రెండు రికార్డులు సచిన్ ఖాతాలోనే సేఫ్‌గా ఉంటాయి.