సత్యసాయి బాబాతో సచిన్ (పాత ఫొటో- PC: Sachin X)
భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) జీవితంలో 2011 మర్చిపోలేని సంవత్సరం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ఏడాదే ‘మాస్టర్ బ్లాస్టర్’ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాడు. సొంతగడ్డపై.. సొంత మైదానం వాంఖడేలో భారత్ టైటిల్ గెలవడంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సహచరులంతా తనను భుజాలపై ఊరేగిస్తుంటే చెమ్మగిల్లిన కళ్లతోనే అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.
నాటి అందమైన జ్ఞాపకాలను సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల (Sathya Sai Baba Birth Centenary Celebrations) కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి వచ్చిన సచిన్.. 2011 వరల్డ్‌కప్ సమయంలో ఒత్తిడిని జయించేందుకు వీలుగా బాబా తనలో స్ఫూర్తి నింపిన తీరు వివరించాడు.
చివరి వరల్డ్‌కప్ అని తెలుసు
‘‘అప్పటికే నేను చాలా వరకు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. 2011 నాటి టోర్నీ నా కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్ అని తెలుసు. అప్పుడు నేను జట్టుతో కలిసి బెంగళూరు శిబిరంలో ఉన్నాను.
బాబా స్వయంగా నాకు ఫోన్ చేశారు
ఆ సమయంలో నాకో ఫోన్ కాల్ వచ్చింది. బాబా స్వయంగా నాకు ఫోన్ చేశారు. నాకొక పుస్తకం పంపించానని చెప్పారు. అప్పుడు నా ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆ ప్రపంచకప్ నా జీవితంలో అత్యంత ముఖ్యమైనదని తెలుసు. జట్టుకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనది.
బాబా మాటలు, ఆయన పంపిన పుస్తకం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అంతర్గత శక్తి పుంజుకుంది. ఆ తర్వాత ఆ పుస్తకం నా జీవితంలో భాగమైపోయింది’’ అని సచిన్ టెండుల్కర్ సత్యసాయి బాబా పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.
అదే విధంగా.. ‘‘2011లో ఏం జరిగిందో అందరూ చూశారు. ముంబైలో శ్రీలంకను ఓడించి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. జాతి మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. నా క్రికెట్ జీవితంలో అదొక గోల్డెన్ మూమెంట్.
బాబా ఆశీర్వాదం వల్లే
అంతకుముందు నా జీవితంలో మునుపెన్నడూ లేని అనుభూతిని అప్పుడే పొందాను. నా శ్రేయోభిలాషులు, గురువులు... వీరందరితో పాటు బాబా ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని సచిన్ టెండుల్కర్ సత్యసాయి బాబా పట్ల భక్తిని చాటుకున్నాడు. ఎదుటివారిని జడ్జ్ చేయకూడదని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పేవారని సచిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.
కాగా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. ఇక సచిన్ టెండుల్కర్‌తో పాటు సినీ నటి ఐశ్వర్యా రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఇదిలా ఉంటే.. ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఫలితంగా సచిన్ ఖాతాలో ఒక్క ప్రపంచకప్ టైటిల్ కూడా లేదనే లోటు ఆ ఏడాది తీరిపోయింది.


