టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక అప్‌డేట్ అందించింది. గిల్ గువాహటికి ప్రయాణం చేస్తాడని స్పష్టం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
మెడ నొప్పి తీవ్రం కావడంతో
ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ భారత తొలి ఇన్నింగ్స్ సమయంలో గాయపడ్డాడు. మెడ నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడాడు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గిల్‌ను ఆస్పత్రికి తరలించిన బీసీసీఐ.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది.
ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉంది. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ మెడ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు. దీంతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో గిల్ విమాన ప్రయాణం చేస్తే.. నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం బయటకు వచ్చింది.
దీంతో సౌతాఫ్రికాతో గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గిల్ అందుబాటులో ఉండడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా గిల్ ఆరోగ్యం గురించి కీలక అప్‌డేట్ అందించింది.
శుబ్‌మన్ గిల్ వెళ్తాడు.. కానీ
ఈ మేరకు.. ‘‘కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాము.
మరుసటి రోజు అతడు డిశ్చార్జ్ అయ్యాడు. చికిత్సకు గిల్ స్పందిస్తున్నాడు. నవంబరు 19న జట్టుతో కలిసి అతడు గువాహటికి ప్రయాణం చేస్తాడు. అయితే, బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. పరిస్థితిని బట్టి అతడిని రెండో టెస్టులో ఆడించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటాం’’ అని బీసీసీఐ బుధవారం నాటి ప్రకటనలో పేర్కొంది.
చదవండి: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే..


