
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం టాప్ ర్యాంక్‌లో కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. ఇవాళ (మే 14) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ల జడేజా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
2022, మార్చి 9న విండీస్ ఆటగాడు జేసన్ హెల్డర్‌ను గద్దె దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన జడ్డూ.. 1152 రోజుల పాటు (38 నెలలకు పైగా) టాప్ ర్యాంక్డ్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆల్‌రౌండర్లైన జాక్ కల్లిస్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ఇది (ఇంతకాలం) సాధ్యం కాలేదు.
36 ఏళ్ల జడ్డూ 2022 మార్చి నుంచి 23 టెస్ట్‌లు ఆడి 36.71 సగటున 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో జడ్డూ 22.34 సగటున 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా, తర్వాతి స్థానాల్లో మెహిది హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్), మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు. మెహిది హసన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి జన్సెన్‌ను కిందికి దించి రెండో స్థానానికి ఎగబాకాడు. మెహిది హసన్‌కు జడేజాకు మధ్య 73 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.
ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న జడేజా జూన్‌లో ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జడేజా 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.