టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు నామమాత్రంగా ఎంపిక చేశారే తప్పిస్తే, ఇప్పటివరకు అతడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. పసికూన ఐర్లాండ్‌పైనే అతడు అరంగేట్రం చేస్తాడని అంతా అనుకున్నా.. అక్కడ అది జరగలేదు. ఇంగ్లండ్‌లో అయినా అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా అంటే, అదీ లేనట్లే కనిపిస్తుంది.
తాజాగా ముగిసిన తొలి టీ20లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మున్ముందు జరిగే నాలుగు మ్యాచ్‌ల్లో దక్కుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి మద్దతు పెరుగుతుంది. అతడిని ఎట్టిపరిస్థితుల్లో రెండో టీ20లో ఆడించాలని అభిమానులు సహా చాలామంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ జాబితాలోకి కొత్తగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చేరాడు. రవిశాస్త్రి ఈ డిమాండ్‌ను వినిపించే క్రమంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై పరోక్ష విమర్శలు గుప్పించాడు. అనుభవం పేరుతో వరుసగా విఫలమవుతున్నా, సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇస్తున్నారన్నట్లు మాట్లాడాడు.
వాస్తవానికి వైభవ్‌కు ఐర్లాండ్ సిరీస్‌లోనే అవకాశం ఇవ్వాల్సిందని, చిన్న గ్రౌండ్స్‌లో అతని భయం లేని బ్యాటింగ్ బాగా ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌లో అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడని.. ఇంగ్లండ్ అండర్-19 పర్యటనలో కూడా అతని ప్రదర్శనలు బలంగా ఉన్నాయని.. ఇప్పటికైనా వైభవ్ అవకాశాలు ఇవ్వడం సమంజసమని అభిప్రాయపడ్డాడు.
శాస్త్రి సహా చాలామంది మాజీలు, అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే.. టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అనుభవం, పరిస్థితులు, బ్యాటింగ్ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్‌కు వరుసగా విఫలమవుతున్నా, అవకాశాలు వస్తున్నాయి. మరి రెండో టీ20లోనైనా వైభవ్‌కు అవకాశమిస్తారో లేదో చూడాలి.


