
కేకేఆర్ ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్ బుచ్చిబాబు టోర్నీలో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో పంజాబ్‌కు ఆడుతున్న అతను.. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని, 101 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.
రమన్‌దీప్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్ వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్రపడిన రమన్‌దీప్.. మల్టీ డే ఫార్మాట్‌లోనూ సత్తా చాటి ఆ ముద్రను చెరిపేసుకున్నాడు.
భారత క్రికెట్‌లో అరుదుగా కనిపించే సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లలో రమన్‌దీప్ ఒకడు. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఇతను భారత్ తరఫున 2 టీ20లు ఆడాడు. దేశవాలీ క్రికెట్‌లో మెరుపులు కారణంగా రమన్‌దీప్‌కు ఐపీఎల్ అవకాశం దక్కింది. ఇతన్ని కేకేఆర్ యాజమాన్యం గత సీజన్‌కు ముందు రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే రమన్‌దీప్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. బ్యాట్‌తో, బంతితో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఈ విషయంలో రమన్‌దీప్‌ను నిందించడం కంటే మేనేజ్‌మెంటే అతన్ని సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పాలి.
అవకాశం ఇచ్చిన అరకొర మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపింది. బౌలింగ్‌లో అస్సలు వినియోగించుకోలేదు. తాజా ప్రదర్శనతో రమన్‌దీప్ కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసిరాడు. తన సేవలను సరిగ్గా వినియోగించుకోవాలని పరోక్ష హెచ్చరిక చేశాడు.
ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతుంది. నిన్న ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగగా.. ఇవాళ మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా, పంజాబ్ తరఫున రమన్‌దీప్ సింగ్ సెంచరీలతో కదంతొక్కారు.