’పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశాను.. రహానే ఆ ట్రిక్‌ మిస్సయ్యాడు’ | Rahane Slammed For Missing A Trick Reminded Of Patidar Supremacy | Sakshi
Sakshi News home page

’పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశాను.. రహానే ఆ ట్రిక్‌ మిస్సయ్యాడు’

Published Mon, Mar 24 2025 2:52 PM | Last Updated on Mon, Mar 24 2025 4:11 PM

Rahane Slammed For Missing A Trick Reminded Of Patidar Supremacy

రహానే- పాటిదార్‌ (Photo Courtesy: BCCI/IPL.com)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అజింక్య రహానేకు శుభారంభం లభించలేదు. అతడి సారథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ తమ తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఇక కేకేఆర్‌ సారథిగా అజింక్య రహానే ఈ మ్యాచ్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌కు కూడా ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం. అయితే, సీనియర్‌ అయిన రహానే.. పాటిదార్‌ పన్నిన వ్యూహాల ముందు తేలిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

కేకేఆర్‌- ఆర్సీబీ మ్యాచ్‌ ఆరంభంలో తాను పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశానని.. అయితే, రహానే తన చెత్త నిర్ణయాలతో అతడి ముందు తలవంచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రజత్‌ పాటిదార్‌ కెప్టెన్‌గా రాణించగలడా? అనే సందేహం ఉండేది.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లు ఆర్సీబీకి బాగానే సాగింది. కానీ నాలుగో ఓవర్లో పాటిదార్‌.. రసిఖ్‌ సలామ్‌ను తీసుకువచ్చాడు. ఐదో ఓవర్లో కృనాల్‌ పాండ్యాను బరిలోకి దించాడు. దయచేసి ఇలా చేయకు పాటిదార్‌ అని మనసులో అనుకుంటూనే ఉన్నాను.

రహానే బ్యాట్‌తో చెలరేగడంతో కేకేఆర్‌ పది ఓవర్లలో వంద పరుగుల మార్కు అందుకుంది. నిజానికి ఆ జట్టు 200కు పైగా స్కోరు చేయాల్సింది. కానీ పాటిదార్‌ వ్యూహాలు అప్పుడే పని చేయడం మొదలుపెట్టాయి. తొలి పది ఓవర్లలో పాటిదార్‌కు కెప్టెన్‌గా అసలు మార్కులేమీ వేయలేకపోయాను.

నిజానికి ఆర్సీబీ బలహీనత స్పిన్నర్లు. కానీ కృనాల్‌ సేవలను పాటిదార్‌ ఉపయోగించుకున్న తీరు అద్బుతం. స్పిన్నర్లనే జట్టుకు బలంగా మార్చాడు. కృనాల్‌ తొలి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చినా.. తర్వాత మూడు వికెట్లు తీశాడు. సూయశ్‌ లూజ్‌ బాల్స్‌ వేసినా.. రసెల్‌ రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

దీంతో కేకేఆర్‌ కనీసం 175 పరుగుల మార్కు కూడా దాటలేకపోయింది. నేను పాటిదార్‌ గురించి ఏమనుకున్నానో.. అది రహానే విషయంలో నిజమైంది. నిజానికి నరైన్‌ను ఆరంభంలోనే బౌలింగ్‌ చేయించాల్సింది. ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు పిండుకుంటున్నా.. నరైన్‌ను రహానే ఆలస్యంగా పిలిపించడం ప్రభావం చూపింది.

రహానే ట్రిక్‌ మిస్సయ్యాడు. దానిని ఆర్సీబీ క్యాష్‌ చేసుకుంది. కెప్టెన్‌గా పాటిదార్‌ హిట్టయితే.. రహానే మాత్రం గతంలో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నా తేలిపోయాడు. ఇక బ్యాటర్‌గానూ పాటిదార్‌ అదరగొట్టాడు. సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో అతడు మూడు సిక్సర్లు బాదడం మామూలు విషయం కాదు.

రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌ ధోని నరైన్‌ బౌలింగ్‌ను చాలాసార్లు ఎదుర్కొన్నారు. అయితే, ముగ్గురూ కలిసి అతడి బౌలింగ్‌లో కేవలం నాలుగు సిక్సర్లే కొట్టారు. అయితే, పాటిదార్‌ మాత్రం ఇక్కడే తన సుప్రిమసీ చూపించాడు. కెప్టెన్‌గా గొప్ప ఆరంభం అందుకున్నాడు’’ అని ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు. కాగా రహానే గతంలో రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్‌(ఇప్పుడు లేదు), రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లకు సారథిగా పనిచేశాడు.

ఐపీఎల్‌-2025: కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు
కేకేఆర్‌- 174/8 (20)
ఆర్సీబీ- 177/3 (16.2)
ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement