భారత్‌పై ఖతర్‌దే పైచేయి

Qatar has the upper hand over India - Sakshi

3–0 గోల్స్‌తో నెగ్గిన ఆసియా చాంపియన్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2026 ఆసియా క్వాలిఫయర్స్‌ 

భువనేశ్వర్‌: ఎలాంటి అద్భుతం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. తమకంటే ఎంతో మెరుగైన ర్యాంక్‌ ఉన్న ఖతర్‌ జట్టును నిలువరించడంలో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు విఫలమైంది. ప్రపంచకప్‌–2026 ఆసియా క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌లో భాగంగా ఆసియా చాంపియన్‌ ఖతర్‌ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌ లో భారత్‌ 0–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

ఖతర్‌ జట్టు తరపున ముస్తఫా మషాల్‌ (4వ ని.లో), అల్మోజ్‌ అలీ (47వ ని.లో), యూసుఫ్‌ అదురిసాగ్‌ (86వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. భారత జట్టుకు కూడా గోల్‌ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్‌ లోపంతో మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా ఖతర్‌ జట్టుతో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ మూడింటిలో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 

ఈనెల 16న కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–0తో గెలిచిన భారత్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 102వ స్థానంలో ఉన్న భారత్‌ అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో రెగ్యులర్‌ గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధూకు విశ్రాంతి కల్పించి మరో గోల్‌కీపర్‌ అమరిందర్‌ సింగ్‌ను ఆడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 61వ స్థానంలో ఉన్న ఖతర్‌ భారత రక్షణపంక్తిలోని లోపాలను సద్వినియోగం చేసుకొని ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్‌ సాధించింది. ఆ తర్వాత భారత జట్టు తేరుకొని ఖతర్‌కు కాస్త పోటీనిచ్చింది.

విరామ సమయానికి ఖతర్‌ 1–0తో ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగం మొదలైన రెండో నిమిషంలోనే ఖతర్‌ ఖాతాలో రెండో గోల్‌ చేరింది. ఆ తర్వాత కూడా ఖతర్‌ తమ జోరు కొనసాగించి మ్యాచ్‌ ముగియడానికి మరో నాలుగు నిమిషాల ముందు మూడో గోల్‌ను సాధించింది. భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి 83 నిమిషాలు ఆడాక అతని స్థానంలో ఇషాన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో ఖతర్‌ ప్రస్తుతం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... మూడు పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను వచ్చే ఏడాది మార్చి 24న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top