
ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారాపై 11వసారి నెగ్గిన పీవీ సింధు
79 నిమిషాల హోరాహోరీ సమరంలో భారత స్టార్‌దే పైచేయి
ఇద్దరి మధ్య 20 సార్లు ముఖాముఖి పోరు
ఆట ఏదైనా కొందరి పోరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. చివర్లో విజేతగా ఎవరు అవతరించినా అభిమానులకు మాత్రం పైసా వసూల్ అవుతుంది. మహిళల బ్యాడ్మింటన్ విషయానికొస్తే భారత స్టార్ పీవీ సింధు, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా మధ్య మైదానంలో వైరం ఇప్పటిది కాదు. 2012లో ఆసియా యూత్ అండర్–19 చాంపియన్‌షిప్‌లో వీరిద్దరి మధ్య తొలి పోరు జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ తమ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సీనియర్ స్థాయిలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు.
ప్రపంచ చాంపియన్‌గా అవతరించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లను అందుకున్నారు. ఈ క్రమంలో సింధు, ఒకుహారా మ్యాచ్‌లంటే బాడ్మింటన్ అభిమానులకు పసందైన విందుగా మారిపోయింది. ఒకసారి సింధు గెలిస్తే, మరోసారి ఒకుహారా నెగ్గి లెక్క సరిచేసేది. తాజాగా ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో వీరిద్దరు తొలి రౌండ్‌లోనే ఎదురెదురుగా తలపడ్డారు.
ఇద్దరి మధ్య 20వ ముఖాముఖి పోరు ఎప్పటిలాగే ఆద్యంతం అద్భుతంగా సాగింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు సింధు గెలిచి తన ప్రియమైన ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. మ్యాచ్ ముగిశాక ఈ చిరకాల ప్రత్యర్థులు పరస్పరం అభినందించుకోవడంతోపాటు... త్వరలో మరోసారి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొనడం విశేషం.
జకార్తా: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తొలి అడ్డంకిని అధిగమించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 22–20, 21–23, 21–15తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహరా (జపాన్)పై అద్భుత విజయం సాధించింది. 79 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు కీలకదశలో పాయింట్లు గెలిచి అనుకున్న ఫలితాన్ని అందుకుంది. సింధు, ఒకుహరా ఇప్పటి వరకు 20 సార్లు అమీతుమీ తలపడగా... అందులో సింధు 11వసారి గెలుపొందింది.
ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌లాండ్ ప్లేయర్ పొర్న్‌పవీ చొచువాంగ్‌తో సింధు ఆడనుంది. ఈ ఏడాది అత్యుత్తమంగా ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సింధు... ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక పలు టోర్నమెంట్‌లలో ఆరంభ దశల్లోనే వెనుదిరిగింది. మరోవైపు ఒకుçహారా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. గత కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న ఈ జపాన్ ప్లేయర్ బరిలోకి దిగిన చివరి ఆరు టోర్నీల్లో రెండో రౌండ్ దాటలేకపోయింది.
‘ఇటీవలి కాలంలో ఆరంభ రౌండ్లలోనే పరాజయాలు ఎదురయ్యాయి. అలాంటి దశలో ఈ విజయం చాలా ముఖ్యమైంది. ఒకుహరాతో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. తను అంత తేలికగా పరాజయాన్ని అంగీకరించదు. ఆటలో రోజురోజుకు చాలా మార్పులు వస్తున్నాయి. సుదీర్ఘ ర్యాలీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటాకింగ్ గేమ్ తగ్గి.. రక్షణాత్మక ధోరణిలో ఆడటం ఎక్కువైంది. ఇక అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆటకు ఫిట్‌నెస్ కీలకమే. దానిపై మరింత దృష్టి సారించాల్సి ఉంది.
ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. ఈ నేపథ్యంలో ఈ విజయం నాలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఓపికగా ఎదురుచూస్తే లయ అందిపుచ్చుకోవచ్చని నిరూపితమైంది. ఫలితంతో సంతోషంగా ఉన్నా. కానీ ఇంకా చాలా విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. ముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా’ అని సింధు మ్యాచ్ అనంతరం పేర్కొంది.
సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 67 నిమిషాల్లో 18–21, 21–18, 21–14తో లియో రాలీ కర్నాండో–బాగస్ మౌలానా (ఇండోనేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్యసేన్ 11–21, 22–20, 15–21తో టాప్ సీడ్ షి యూఖీ (చైనా) చేతిలో ఓడాడు.
65 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో పరాజయం పాలైన లక్ష్యసేన్... ఆ తర్వాత పుంజుకున్నా... కీలక సమయాల్లో పాయింట్లు గెలిచిన చైనా ప్లేయర్ మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 18–21తో ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ (భారత్) 21–16, 16–15తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో అనుపమ (భారత్) 15–21, 9–21తో కిమ్ గా యిన్ (కొరియా) చేతిలో... రక్షిత శ్రీ (భారత్) 21–14, 15–21, 12–21 సుపనిద కటెథాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు.