సింధు ఇంటికి... | PV Sindhu loses in pre quarterfinal | Sakshi
Sakshi News home page

సింధు ఇంటికి...

Apr 11 2025 4:05 AM | Updated on Apr 11 2025 4:05 AM

PV Sindhu loses in pre quarterfinal

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన భారత స్టార్‌ షట్లర్‌

కిరణ్‌ జార్జి, ప్రియాన్షు కూడా అవుట్‌  

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ సింగిల్స్‌ విభాగం నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జి, ప్రియాన్షు రజావత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓటమి చవిచూశారు. గతంలో రెండుసార్లు ఈ టోర్నీలో కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి మాత్రం నిరాశపరిచింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్‌ సింధు 12–21, 21–16, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, తన చిరకాల ప్రత్యర్థి అకానె యామగుచి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. 

66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ కోల్పోయినా, వెంటనే తేరుకొని రెండో గేమ్‌లో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. గతంలో 14 సార్లు అకానె యామగుచిపై నెగ్గిన సింధుకు నిర్ణాయక మూడో గేమ్‌లో గట్టిపోటీ లభించింది. కీలకదశలో యామగుచి పైచేయి సాధించి సింధుపై 12వ సారి విజయాన్ని అందుకుంది. 

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రియాన్షు 14–21, 17–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌) చేతిలో, కిరణ్‌ జార్జి 21–19, 13–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.  

క్వార్టర్‌ ఫైనల్లో తనీషా–ధ్రువ్‌ జోడీ 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) జోడీ పతకానికి విజయం దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తనీషా–ధ్రువ్‌ కపిల జంట 12–21, 21–16, 21–18తో యె హాంగ్‌ వె–నికోల్‌ గొంజాలెస్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఐదో సీడ్‌ చున్‌ మాన్‌ టాంగ్‌–యింగ్‌ సుయెట్‌ సె (హాంకాంగ్‌) జోడీతో నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో తనీషా–ధ్రువ్‌ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంటారు. 

మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అశిత్‌ సూర్య–అమృత (భారత్‌) జంట 11–21, 14–21తో టాప్‌ సీడ్‌ జియాంగ్‌ జెన్‌ బాంగ్‌–వె యా జిన్‌ (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రూబన్‌ కుమార్‌–హరిహరన్‌ (భారత్‌) జంట 15–21, 14–21తో ఆరోన్‌ చియా–వుయ్‌ యిక్‌ సో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement