
చెన్నై: జాతీయ సబ్ జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో పంజాబ్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్ 4–3 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టును ఓడించింది. తొలి క్వార్టర్‌లో రెండు జట్లు ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్‌లో జార్ఖండ్ దూకుడు పెంచి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 21వ నిమిషంలో ఆశిష్ గోల్‌తో ఖాతా తెరిచిన జార్ఖండ్... 24వ నిమిషంలో అనీశ్ డుంగ్‌డుంగ్ గోల్‌తో 2–0తో ముందంజ వేసింది.
అయితే పంజాబ్ కూడా తగ్గేదేలే అన్నట్లు ఆడింది. నిమిషం తేడాలో రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. 29వ నిమిషంలో అక్షిత్ సలారియా గోల్‌తో బోణీ కొట్టిన పంజాబ్, 30వ నిమిషంలో వరీందర్ సింగ్ గోల్‌తో స్కోరును సమం చేసింది. 42వ నిమిషంలో సుఖు గురియా గోల్‌తో జార్ఖండ్ 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు నిమిషాల తర్వాత మన్‌దీప్ సింగ్ (45వ నిమిషంలో) గోల్‌తో పంజాబ్ స్కోరును 3–3తో సమం చేసింది.
మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా మన్‌దీప్ సింగ్ (53వ నిమిషంలో) గోల్ చేసి పంజాబ్‌కు 4–3తో ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పంజాబ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని టైటిల్‌ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన కాంస్య పతక పోరులో ఉత్తరప్రదేశ్ 5–3 గోల్స్ తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.