
తొమ్మిదో విజయంపై పంజాబ్ కింగ్స్ దృష్టి
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
జైపూర్: సుదీర్ఘ విరామం అనంతరం ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడంపై దృష్టి పెట్టింది. 2014లో చివరిసారి ‘ప్లే ఆఫ్స్’కు చేరి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్... ఆ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ‘టాప్–4’లో చోటు దక్కించుకుంది. ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శిక్షణలో తొలి టైటిల్ వేట దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్... ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం తలపడనుంది.
ఇరు జట్ల మధ్య ఈ నెల 8న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో... పాకిస్తాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్నే తాజాగా తటస్థ వేదిక జైపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన పంజాబ్ 8 విజయాలు, 3 పరాజయాలు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో... 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ నెగ్గితే... పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలవడం ద్వారా ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం పొందనుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి పంజాబ్ జోరు కొనసాగిస్తుందా... లేక ఢిల్లీ సత్తా చాటుతుందా చూడాలి!
టాపార్డర్ ఫుల్ జోష్‌లో...
ఇప్పటి వరకు రెండు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్‌పై పంజాబ్ కింగ్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. 2019, 20లో ఢిల్లీ జట్టును ‘ప్లే ఆఫ్స్’ చేర్చిన శ్రేయస్... 2024లో కోల్‌కతాకు మూడోసారి కప్పు అందించాడు. తాజా సీజన్‌లో అతడు 174.69 స్ట్రయిక్‌రేట్‌తో 435 పరుగులు చేశాడు. గతేడాదితో పోల్చుకుంటే అతడి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లే ముగిసిన తర్వాత అత్యధిక స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన రెండో ఆటగాడు శ్రేయస్ అయ్యరే.
నికోలస్ పూరన్ 211.51 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబడితే... శ్రేయస్ 182.19 స్ట్రయిక్‌రేట్‌తో దంచి కొట్టాడు. ఓపెనర్లు ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టుకు వరంగా మారారు. నిలకడ కొనసాగిస్తున్న ఈ జోడీ... ఢిల్లీతో ఈ నెలారంభంలో జరిగిన పోరులోనూ అదిరిపోయే ఆరంభం అందించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 122 పరుగులు జోడించారు. ఈ సమయంలో అనివార్య కారణాల వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ 38.17 సగటుతో 458 పరుగులు చేయగా... ప్రియాన్‡్ష ఆర్య 356 పరుగులు సాధించాడు.
ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెస్ రూపంలో కింగ్స్‌కు మెరుగైన బ్యాటింగ్ దళం ఉంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్, యుజువేంద్ర చాహల్, యాన్సెన్, జేమీసన్ కీలకం కానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... లీగ్ నుంచి తిరుగుపయనమైన విదేశీ ఆటగాళ్లంతా తిరిగి అందుబాటులోకి రావడంతో పంజాబ్ కింగ్స్ మరింత బలంగా తయారైంది.
అక్షర్ పటేల్ అనుమానమే!
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో ఒకదశలో సునాయాసంగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుందనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ముంబై చేతిలో ఓటమితో రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఏకైక మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చి గౌరవంగా సీజన్‌కు గుడబై చెప్పాలని చూస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 56.00 సగటు, 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 504 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉండగా... అభిషేక్ పోరెల్ 301 పరుగులు చేశాడు.
జ్వరం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో చూడాలి. అతడు అందుబాటులో లేకపోతే మరోసారి డు ప్లెసిస్ ఢిల్లీ జట్టును నడిపించనున్నాడు. డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్‌తో జట్టుకు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
అయితే ఢిల్లీ అసలు సమస్య మాత్రం నిలకడగా వికెట్లు తీయగల ప్రధాన బౌలర్ లేకపోవడమే. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవడంతో ఢిల్లీ బౌలింగ్ డీలా పడింది. ముకేశ్ కుమార్, ముస్తఫిజుర్, చమీరా, కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా)
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్, జేమీసన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, చమీరా, ముస్తఫిజుర్, ముకేశ్ కుమార్.