
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశ
ఇండోనేసియా ఓపెన్ టోర్నీ
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 22–20తో పొలీనా బురోవా–యెవెనియా కాంటెమిర్ (ఉక్రెయిన్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకోగా... రెండో గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొంది.
నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో యుకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో (జపాన్)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; అశిత్ సూర్య–అమృత జోడీలు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
సతీశ్–ఆద్య జోడీ 15–21, 21–16, 21–17తో యె హోంగ్ వె–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. రుత్విక–రోహన్ 14–21, 9–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) చేతిలో, అశిత్–అమృత 15–21, 9–21తో మాడ్స్ వెస్టెర్‌గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) చేతిలో, తనీషా–ధ్రువ్ 11–21, 21–16, 14–21తో టాంగ్ జి చెన్–ఈ వె తో (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
కిరణ్ జార్జి ఓటమి
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం లక్ష్య సేన్, ప్రణయ్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... రెండో రోజు బుధవారం కిరణ్ జార్జి కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 20–22, 9–21తో ఓడిపోయాడు.