
భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తున్న గిల్‌ను చూస్తే గర్వంగా ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పంజాబీ బ్యాటర్ మరిన్ని శతకాలు బాది తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకోవాలని ఆకాంక్షించాడు.
కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా జరుగుతున్న ఈ సిరీస్ సందర్భంగా యువ ఆటగాడు గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఉన్న జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తొలి టెస్టులోనే బ్యాట్ ఝులిపించాడు.
చారిత్రాత్మక విజయం
లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన (147) గిల్.. సారథిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో చెలరేగి చారిత్రాత్మక గెలుపును రుచిచూశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టీమిండియాను గెలిపించిన సారథిగా చరిత్రకెక్కాడు.
గర్వంగా ఉంది
ఈ నేపథ్యంలో గిల్ మెంటార్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని శుబ్‌మన్ సవాలుగా తీసుకున్నాడు. అతడిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఒకే టెస్టు మ్యాచ్‌లో 400కు పైగా పరుగులు సాధించడం మామూలు విషయం కాదు.
గిల్ ఆట నన్నెంతగానో ఆకట్టుకుంది. అతడు మరిన్ని సెంచరీలు కొట్టాలి. గిల్ తండ్రి కూడా ఎంతో గర్వించి ఉంటారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక విజయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాత్ర కూడా ఉందన్నాడు యువీ.
ఆ ఇద్దరికీ క్రెడిట్ దక్కాల్సింది
‘‘టీమిండియా గెలవాలని నాతో పాటు అందరూ కోరుకున్నారు. అయితే, ఈ విజయంలో గౌతం, అజిత్ అగార్కర్‌కు దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదని అనిపిస్తోంది. ఈ జట్టును ఒక్కచోటికి చేర్చడంలో వారిదే కీలక పాత్ర. తదుపరి మ్యాచ్‌లలోనూ టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని యువీ చెప్పుకొచ్చాడు.
కాగా యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం లండన్‌లో జరిగింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌తో పాటు విరాట్ కోహ్లి, బ్రియన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. శుబ్‌మన్ గిల్ సేన కూడా ఇందులో భాగమైంది. ఈ సందర్భంగానే యువీ గిల్ గురించి పైవిధంగా స్పందించాడు.