
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రొ లీగ్ టోర్నీ భారత జట్టుకు పాఠంలాంటిదని భారత మాజీ కెప్టెన్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్ (PR Sreejesh) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచకప్‌కు ముందు మనకిది మేలుకొలుపు సంకేతమని చెప్పాడు. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది.
అనంతరం జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడలు సెపె్టంబర్ 19 నుంచి 4 వరకు జరుగుతాయి. కాగా యూరోపియన్ అంచె ప్రొ లీగ్ పోటీల్లో భారత జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. తొమ్మిది జట్లు పోటీపడిన యూరోపియన్ అంచెలో భారత పురుషుల జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఆఖరిదాకా పోరాడారు
అయితే ఫలితాలు నిరాశపరిచినప్పటికీ భారత ఆటగాళ్ల ప్రదర్శన మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదని ప్రస్తుతం భారత అండర్–21 జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న శ్రీజేశ్ చెప్పుకొచ్చాడు.
అక్టోబర్‌లో జరిగే వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీజేశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నిజానికి మన ఆటగాళ్లు బాగానే ఆడారు. ప్రతీ మ్యాచ్‌లోనూ గోల్స్ కోసం ఎన్నో అవకాశాల్ని సృష్టించారు.
గెలిచేందుకు ఆఖరిదాకా పోరాడారు. కొన్నిసార్లు ఇంతబాగా ఆడినప్పటికీ దురదృష్టవశాత్తూ నిరుత్సాహకర ఫలితాలు వస్తాయి. యూరోప్‌లో సరిగ్గా అదే జరిగింది’ అని వివరించాడు.
ఆ అంచె పోటీల కోసం చక్కగా సన్నద్దమైనప్పటికీ మైదానంలో ఫలితాలే ప్రతికూలమయ్యాయన్నాడు. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆసియా కప్, ప్రపంచకప్ మెగా ఈవెంట్లకు మరింత మెరుగ్గా సిద్ధమవ్వాల్సిన ఆవశ్యకతను యూరోపియన్ అంచె పోటీలు తెలియజేస్తున్నాయని చెప్పాడు.
కోచ్‌గా ప్రయాణం ఎలా ఉందంటే?
కాగా టోక్యో, పారిస్ వరుస ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకాలు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేశ్.. సుదీర్ఘమైన కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. అండర్–21 జూనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ కోచింగ్ ప్రయాణంపై మాట్లాడుతూ ఆటగాడిలాగే రొటీన్‌గా ఉందన్నాడు. ఉదయమే నిద్రలేవడం, ప్లేయర్లకు వార్మప్ తదుపరి శిక్షణ ఇవ్వడం, తదుపరి ట్రెయినింగ్ సెషన్ వ్యవహరాలు చక్కదిద్దడం, విశ్లేషించడం జరుగుతోందన్నాడు. అప్పుడు అటగాడిగా ఎక్కువగా శారీరకంగా శ్రమిస్తే ఇప్పుడు కోచ్‌గా మానసికంగా ఎక్కువ శ్రమించాల్సి వస్తోందని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది చెన్నై, మదురై నగరాల్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగే జూనియర్ ప్రపంచకప్ కోసం జట్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నానని చెప్పాడు.
ముందుగా ఒక్కో మ్యాచ్ గెలవడం, క్వార్టర్స్ చేరడం తమ లక్ష్యాలుగా ఉన్నాయన్నాడు. చిరకాల ప్రత్యర్థులు (భారత్, పాక్) ఒకే పూల్ (బి)లో ఉన్నప్పటికీ దీనిపై అనవసరంగా చర్చించి కుర్రాళ్లపై ఒత్తిడి పెంచదల్చుకోలేదని పేర్కొన్నాడు.