
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌లో "భీమవరం బుల్స్" ఫ్రాంచైజీ సారధిగా నియమించబడ్డాడు. ఈ మేరకు సదరు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ముగిసిన వేలంలో భీమవరం బుల్స్ నితీశ్‌ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్న నితీశ్.. పర్యటన ముగియంగానే బుల్స్‌తో జతకడతాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నాలుగో ఎడిషన్ ఆగప్ట్ 8న మొదలుకానుంది. అదే నెల 24న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖలోని Dr.YSR ACA-VDCA స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్‌లో ఏపీఎల్ ఏడు కొత్త జట్లతో బరిలోకి దిగుతుంది. గతంలో ఉన్న ఆరు ఫ్రాంచైజీలు తెరమరుగయ్యాయి.
భీమవరం బుల్స్ ఫుల్ స్క్వాడ్
నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), సత్యనారాయణ రాజు, హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, పిన్నిటి తేజస్వి, మునీష్ వర్మ, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, ఎం యువన్, బి సాత్విక్, కె రేవంత్ రెడ్డి, సాయి సూర్య తేజ రెడ్డి, సిహెచ్ శివ, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, ఎన్ హిమాకర్, కశ్యప్ ప్రకాశ్, భువనేశ్వర్ రావు, భస్వంత్ కృష్ణ, జె విష్ణు దత్తా
హనుమ విహారీ, కేఎస్ భరత్ కూడా..!
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు కూడా వేర్వేరు ఫ్రాంచైజీలకు సారథ్యం వహిస్తారు. భారత టెస్ట్ క్రికెటర్లు హనుమ విహారీ అమరావతి రాయల్స్‌కు, కేఎస్ భరత్ కాకినాడ కింగ్స్ కు నాయకత్వం వహిస్తారు.
మిగిలిన నాలుగు జట్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైనర్స్‌కు వరుసగా షేక్ రషీద్, రికీ భుయ్, మహదీప్, అశ్విన్ హెబ్బర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
కాగా, జులై 14న జరిగిన APL 2025 వేలం మొత్తం 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆల్ రౌండర్ పైలా అవినాష్ ఈ వేలంలో అత్యధికంగా రూ. 11.5 లక్షల బిడ్‌ను సంపాదించాడు.
తదుపరి రెండు ఖరీదైన బిడ్‌లు రాయల్స్ ఆఫ్ రాయలసీమకు చెందిన పి. గిరినాథ్ రెడ్డి (రూ. 10.05 లక్షలు), భీమవరం బుల్స్ ఆల్ రౌండర్ సత్యనారాయణ రాజుకు (రూ. 9.8 లక్షలు) దక్కాయి.