టైటిల్‌ వేటలో... | Pro Kabaddi League 11th season final today | Sakshi
Sakshi News home page

టైటిల్‌ వేటలో...

Dec 29 2024 4:18 AM | Updated on Dec 29 2024 4:18 AM

Pro Kabaddi League 11th season final today

నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ ఫైనల్‌ 

తుదిపోరులో హరియాణాతో పట్నా ఢీ 

రాత్రి 8 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

పుణే: రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)–11వ సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా... హరియాణా స్టీలర్స్‌తో మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ టైటిల్‌ కోసం తలపడనుంది. వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరిన హరియాణా స్టీలర్స్‌... ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ ముద్దాడిన పట్నా మధ్య రసవత్తర పోరు ఖాయమే. 

తొలిసారి చాంపియన్‌గా నిలవాలనుకుంటున్న హరియాణా స్టీలర్స్‌కు జైదీప్‌ సారథ్యం వహిస్తుండగా... మన్‌ప్రీత్‌ సింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్‌ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నేరుగా సెమీఫైనల్‌కు చేరిన స్టీలర్స్‌... తుదిపోరులోనూ అదే జోరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది. స్టీలర్స్‌ తరఫున శివమ్‌ పాతరె, వినయ్, జైదీప్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

ముఖ్యంగా యూపీ యోధాస్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చిన శివమ్, వినయ్‌ ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని స్టీలర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. డిఫెన్స్‌లో రాహుల్, సంజయ్‌ కీలకం కానున్నారు. 

మరోవైపు గతంలో వరుసగా మూడు సార్లు పీకేఎల్‌ ట్రోఫీ చేజిక్కించుకున్న పట్నా... ఇప్పుడు నాలుగో టైటిల్‌ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. యువ ఆటగాళ్లు దేవాంక్‌ దలాల్, అయాన్‌ లోచాబ్‌ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన పైరేట్స్‌.. అదే జోష్‌లో టైటిల్‌ పట్టాలని చూస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement