Photo Credit: Twitter
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా 3-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి రెండు టీ20లకు జట్టులో కొన్ని ప్రయోగాలు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో ఇవాళ జరగనున్న నాలుగో టీ20లో జట్టులో మార్పులు ఖాయమని వార్తలు వస్తున్నాయి. సిరీస్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముందని వార్తలొస్తున్నాయి.
అతడి స్థానంలో శివమ్ దూబేను ఆడించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నమన్ ధీర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలనే జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనను మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న నమన్ ధీర్‌ను పక్కనబెట్టాలనుకోవడం పెద్ద నేరమవుతుందన్నాడు. ప్రస్తుతం నమన్ ధీర్ ఉన్న అద్భుత ఫామ్ దృష్ట్యా, బెంచ్ బలాన్ని పరీక్షించే నెపంతో అతడిని ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించడం కరెక్ట కాదని అభిప్రాయపడ్డాడు.
ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఉన్న ఫామ్ కారణంగా నమన్ ధీర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలనే ఆలోచన నా దృష్టిలో నేరం కిందకే వస్తుంది. ఆల్‌రౌండర్ అయినప్పటికీ అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. జట్టు బౌలింగ్ కూర్పు బాగుండడంతో నమన్‌కు బౌలింగ్ వేసే అవకాశం రావడం లేదన్నది వేరే విషయం. కానీ, అతడికి బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ఇక శివమ్ దూబే విషయానికొస్తే, అతనికి తుది 11 మందిలో చోటు దక్కకపోవడం మిస్టరీగా మారిపోయింది.
నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధీర్ రాకతో జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకంగా మారింది. వీరిద్దరి రాకకు ముందు శివమ్ దూబే కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్‌లో వన్డే క్రికెట్ ఆడాడు. మంచి ప్రదర్శన చేసినప్పటికీ, పోటీ కారణంగా ఇప్పుడు టీ20 జట్టులో తుది 11 మందిలో చోటు సంపాదించలేకపోతున్నాడు. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆ రెండు ఫైనల్స్‌లోనూ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేశాడు.
ఈ కారణం చేతనే దూబేకు ఇంతకాలం అవకాశాలు వచ్చాయేమో. కానీ ఇప్పుడు పోటీ పెరగడంతో అతడు బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తోంది. కానీ శివమ్ దూబే కోసం నమన్ ధీర్‌ను పక్కనబెట్టొద్దన్నది నా వాదన. దూబే ఆడినా అది నితీశ్‌కుమార్ రెడ్డి స్థానంలో ఆడిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం.
అయితే నితీశ్ ఉన్న ఫామ్ దృష్ట్యా అతడికి విశ్రాంతినివ్వడం కూడా తప్పిదమే అవుతుంది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకోవడంతో ప్రయోగాలపై దృష్టి సారించడం మంచిదే అయినప్పటికీ, క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక నమన్ ధీర్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. తొలి టీ20లో 15 బంతుల్లోనే 42 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. రెండో టీ20లోనూ 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి తిలక్ వర్మపై ఒత్తిడి తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ, నితీశ్‌రెడ్డిలు అజేయంగా నిలిచిన జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. మూడో టీ20లోనూ విన్నింగ్ షాట్ ఆడిన నమన్ ధీర్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.
ఇదీ చదవండి:


