
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.
మహారాష్ట్ర Vs కేరళ
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్‌కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారి
ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్‌లో కణ్ణుమ్మల్‌కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఖాతా తెరిచిన రుతు
వీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు.
ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
వరుస సెంచరీల తర్వాత
కాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్‌బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.
రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లు
మహారాష్ట్ర
అంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.
కేరళ
మహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్‌కులి బాసిల్, సల్మాన్ నిజార్.
చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ