
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టు కాస్త పర్వాలేదన్పించిన ఈ కర్ణాటక పేసర్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ప్లాట్ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో తెలియక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు వేసిన ప్రసిద్ద్.. 5.50 ఏకానమితో 72 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ప్రసిద్ద్‌ను ఇంగ్లండ్ యువ ఆటగాడు జేమీ స్మిత్ ఉతికారేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ బౌలింగ్‌లో స్మిత్ ఏకంగా 23 పరుగులు రాబట్టాడు.
స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది. ఈ క్రమంలో ప్రసిద్ద్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసిన బౌలర్లలో అత్యధిక ఎకానమీ రేట్ నమోదు చేసిన బౌలర్‌గా ప్రసిద్ద్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(4.77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆరోన్ రికార్డును కృష్ణ బ్రేక్ చేశాడు.
అదేవిధంగా 2000 సంవత్సరం తర్వాత టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన నాలుగో భారత బౌలర్‌గా ఈ కర్ణాటక పేసర్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ద్ ఒకే ఓవర్‌లో 23 రన్స్ ఇచ్చాడు. ఈ జాబితాలో ప్రసిద్ద్ కంటే ముందు హర్భజన్ సింగ్(27), మునాఫ్ పటేల్(25), కర్ణ్ శర్మ (24) ఉన్నారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు.
భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్