
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో పుణేరి పల్టన్ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో పుణేరి పల్టన్ 41–36 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. పల్టన్ తరఫున ఆదిత్య షిండే 13 పాయింట్లు సాధించగా... కెప్టెన్ పంకజ్ మోహితె 8 పాయింట్లు సాధించాడు.
మరోవైపు... జైపూర్ తరఫున అలీ సమది 22 పాయింట్లతో విజృంభించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 47–40 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. ఆదివారం యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.
ఇదీ చదవండి: ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి
అల్ అయిన్ (యూఏఈ): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్... అల్ అయిన్ మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో పరాజయం పాలవగా... మహిళల విభాగంలో తస్నీమ్ మీర్, శ్రియాన్షి వలిశెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లారు.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 4–21, 21–11, 19–21తో రెండో సీడ్ ఆదిల్ షోలెహ్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడాడు.
ఇక మహిళల సింగిల్స్‌లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ నంబర్‌వన్, 20 ఏళ్ల తస్నీమ్ మీర్ సత్తాచాటింది. సెమీస్‌లో ఆరో సీడ్ తస్నీమ్ 9–21, 21–17, 21–10తో ఐదో సీడ్ నెస్లిహన్ అరిన్ (తుర్కియే)పై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఏడో సీడ్ శ్రియాన్షి 21–11, 21–12తో చియారా మార్వెల్లా హండోయో (ఇండోనేసియా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.
ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్–100 ఫైనల్.