
ఢిల్లీ వేదికగా అక్టోబర్ 25 నుంచి ప్లే ఆఫ్స్
న్యూఢిల్లీ: హోరాహోరీ పోరాటాలతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఫైనల్ ఈ నెల 31న జరగనుంది. శనివారం నుంచి ఢిల్లీ అంచె పోటీలు ప్రారంభం కానుండగా... లీగ్ దశ ముగిసిన అనంతరం ప్లే ఆఫ్స్ కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం పీకేఎల్ నిర్వాహకులు ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 23తో లీగ్ దశకు తెరపడనుండగా... పాయింట్ల పట్టికలో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి.
జట్ల మధ్య మరింత పోటీ పెంచేందుకు... తాజా సీజన్ నుంచి పీకేఎల్‌లో పలు మార్పులు చేశారు. ఈ నెల 25 నుంచి జరగనున్న ‘ప్లే ఇన్స్’లో పట్టికలో 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లు తలపడతాయి. అందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగు పెడుతుంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు ప్లే ఆఫ్స్ జరుగుతాయి. తొలి రోజు ఎలిమినేటర్–1, మినీ క్వాలిఫయర్... మరుసటి రోజు ఎలిమినేటర్–2, క్వాలిఫయర్–1 నిర్వహిస్తారు. అక్టోబర్ 28న ఎలిమినేటర్–3, 29న క్వాలిఫయర్–2 నిర్వహిస్తారు.
ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ఈ నెల 31 శుక్రవారం జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తాజా సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా... అభిమానుల్లో ఆసక్తి పెంపొందించేందుకే ఎక్కువ జట్లు ప్లే ఆఫ్స్ చేరే విధంగా టోర్నీని మార్చారు. దీంతో హోరాహోరీ పోరాటాలు పెరగడంతో పాటు... ప్రతి జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఫైనల్ నిర్వహించనుండటం ఇది నాలుగోసారి. ఇక ఈ సీజన్‌లో విజృంభిస్తున్న దబంగ్ ఢిల్లీ జట్టు... ఇప్పటికే టాప్–8 చోటు ఖాయం చేసుకుంది.