పంజాబ్‌ పరాక్రమం | PBKS vs LSG IPL 2025: Punjab Kings win by 37 runs | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ పరాక్రమం

May 5 2025 3:41 AM | Updated on May 5 2025 3:41 AM

PBKS vs LSG IPL 2025: Punjab Kings win by 37 runs

మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరువ

37 పరుగులతో లక్నో చిత్తు

ధర్మశాల: ఐపీఎల్‌లో ఎప్పుడో 2014లో ఫైనల్‌ చేరిన పంజాబ్‌ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ‘టాప్‌–4’లో నిలిచేందుకు మరింత చేరువైంది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిపోతున్న జట్టు ఆదివారం జరిగిన పోరులో 37 పరుగులతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (15 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జోష్‌ ఇన్‌గ్లిస్‌ (14 బంతుల్లో 30; 1 ఫోర్, 4 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆయుశ్‌ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), అబ్దుల్‌ సమద్‌ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో పోరాడినా విజయానికి అది సరిపోలేదు.  

సమష్టిగా చెలరేగి... 
తొలి ఓవర్లోనే ప్రియాన్షి ఆర్య (1) అవుట్‌ కావడం మినహా ఇన్నింగ్స్‌ ఆసాంతం పంజాబ్‌ హవానే సాగింది. బరిలోకి దిగిన మిగతా ఆరుగురు బ్యాటర్లూ మెరుపు షాట్లతో దూకుడు ప్రదర్శించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మయాంక్‌ తొలి ఓవర్లో ఇన్‌గ్లిస్‌ వరుసగా 3 సిక్సర్లతో చెలరేగిపోగా... అతని రెండో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. ప్రభ్‌సిమ్రన్‌ 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిడాఫ్‌లో సులువైన క్యాచ్‌ వదిలేసి పూరన్‌ పెద్ద తప్పిదం చేశాడు! పవర్‌ప్లేలో పంజాబ్‌ 66 పరుగులు చేసింది. 30 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా మూడో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. 

శ్రేయస్‌ కూడా కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం తగ్గకుండా చూడగా, వధేరా (16) కూడా ధాటిగా ఆడాడు. 16 ఓవర్లలో జట్టు స్కోరు 171/4. అవేశ్‌ వేసిన 18వ ఓవర్లో శశాంక్‌ 2 ఫోర్లు...ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 6, 4 6 బాదడంతో మొత్తం 26 పరుగులు లభించాయి. చివరి 4 ఓవర్లలో పంజాబ్‌ 65 పరుగులు రాబట్టింది.  ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. ఆరంభంతోనే చక్కటి బౌలింగ్‌తో 3 వికెట్లు తీసిన అర్ష దీప్ సింగ్ ప్రత్యరి్థని దెబ్బ కొట్టాడు. తన రెండో ఓవర్లో మిచెల్‌ మార్‌‡్ష (0), మార్క్‌రమ్‌ (13)లను వెనక్కి పంపిన అర్‌‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో పూరన్‌ (6)ను కూడా అవుట్‌ చేయడంతో లక్నో కష్టాల్లో పడింది. రిషభ్‌ పంత్‌ (18) తన వైఫల్యాన్ని కొనసాగించగా, డేవిడ్‌ మిల్లర్‌ (11) కూడా ప్రభావం చూపలేకపోయాడు.

స్కోరు వివరాలు  
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్షి (సి) మయాంక్‌ (బి) ఆకాశ్‌ 1; ప్రభ్‌సిమ్రన్‌ (సి) పూరన్‌ (బి) రాఠీ 91; ఇన్‌గ్లిస్‌ (సి) మిల్లర్‌ (బి) ఆకాశ్‌ 30; శ్రేయస్‌ (సి) మయాంక్‌ (బి) రాఠీ 45; వధేరా (బి) ప్రిన్స్‌ 16; శశాంక్‌ (నాటౌట్‌) 33; స్టొయినిస్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–2, 2–50, 3–128, 4–162, 5–216. బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 4–0–30–2, మయాంక్‌ యాదవ్‌ 4–0–60–0, అవేశ్‌ ఖాన్‌ 4–0–57–0, దిగ్వేశ్‌ రాఠీ 4–0–46–2, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–43–1. 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) అర్ష దీప్ సింగ్ 13; మార్‌‡్ష (సి) వధేరా (బి) అర్ష దీప్ సింగ్ 0; పూరన్‌ (ఎల్బీ) (బి) అర్ష దీప్ సింగ్ 6; పంత్‌ (సి) శశాంక్‌ (బి) అజ్మతుల్లా 18; బదోని (సి) అర్ష దీప్ సింగ్ (బి) చహల్‌ 74; మిల్లర్‌ (సి) శశాంక్‌ (బి) అజ్మతుల్లా 11; సమద్‌ (సి) అండ్‌ (బి) 45; అవేశ్‌ (నాటౌట్‌) 19; ప్రిన్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–27, 4–58, 5–73, 6–154, 7–188. బౌలింగ్‌: అర్ష దీప్ సింగ్ 4–0–16–3, యాన్సెన్‌ 4–0–31–1, అజ్మతుల్లా 4–0–33–2, చహల్‌ 4–0–50–1, వైశాక్‌ 3–0–49–0, స్టొయినిస్‌ 1–0–17–0.

Advertisement
 
Advertisement
Advertisement