అంతా ఊహించిందే జరిగింది. టీ20 వరల్డ్‌కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్‌కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.
పొట్టి ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.
కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది.
"బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.
పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.


