
ఆసియా కప్‌లో శుభారంభం
ఒమన్‌పై 93 పరుగులతో ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీని పాకిస్తాన్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. తొలిసారి ఆసియా కప్ బరిలోకి దిగిన ఒమన్ జట్టు పాక్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా...ఛేదనలో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది.
అబుదాబిలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. ఓపెనర్ సయీమ్ అయూబ్ (0) డకౌట్ కాగా... మొహమ్మద్ హరీస్ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాహిబ్‌జాదా ఫర్హాన్ (29 బంతుల్లో 29; 1 ఫోర్) కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఒమన్ సఫలమైనా...ఆ తర్వాత పట్టు విడిచింది.
హరీస్, ఫర్హాన్ రెండో వికెట్‌కు 64 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (0) తొలి బంతికే వెనుదిరగ్గా... ఫఖర్ జమాన్ (23 నాటౌట్; 2 ఫోర్లు), మొహమ్మద్ నవాజ్ (19 నాటౌట్) కూడా కీలక పరుగులు జత చేయడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్ పూర్తిగా చేతులెత్తేసింది.
హమ్మద్ మీర్జా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలబడలేకపోయారు. పాకిస్తాన్ తరఫున ఫహీమ్ అష్రఫ్, ముఖీమ్, అయూబ్ తలా 2 వికెట్లు తీశారు. పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో రేపు భారత్‌ను ఎదుర్కొంటుంది.