పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెప్పినట్లు తాము నడుచుకోమని.. ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే వింటామంటూ అతి చేసింది. ఈ నేపథ్యంలో అసలు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చడమే కాకుండా.. ఐసీసీని కావాలనే చికాకు పెట్టే చర్యలకు పూనుకుంటోందని ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా బోర్డు (BCB) తాము భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్‌లో తమకు భద్రత లేదన్న బంగ్లా వాదనను కొట్టిపారేసింది. అంతేకాదు తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు కూడా ఇచ్చింది.
బంగ్లాదేశ్‌కు అండగా పాక్
అయితే, బంగ్లాదేశ్ మాత్రం తమ ప్రభుత్వం నిర్ణయానుగుణంగా టోర్నీ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపింది. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాక్.. తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. నిజానికి భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగానే తటస్థ వేదికలపై ఇరు దేశాల జట్లు ఐసీసీ ఈవెంట్లలో ముఖాముఖి తలపడుతున్నాయి.
ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాకిస్తాన్ (Pakistan)కు శ్రీలంకను తటస్థ వేదికగా నిర్ణయించారు. తమకు అనుకూలంగానే నిర్ణయం ఉన్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ పాకిస్తాన్ కొత్త రాగం ఎత్తుకుంది. ఈ క్రమంలోనే బంగ్లా మాదిరే పాక్‌ను కూడా టోర్నీ నుంచి తప్పించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పాక్ తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించింది.
వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పలేదు
ఫలితంగా ఈ ఐసీసీ (ICC) ఈవెంట్లో పాక్ పాల్గొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందిస్తూ.. తాము జట్టును ప్రకటించినంత మాత్రాన వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పినట్లు కాదని ఓవరాక్షన్ చేశాడు.
"ఈ విషయం గురించి మా ఆటగాళ్లతో చర్చించాము. బోర్డు, ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోదాఢ్యమని మా ఆటగాళ్లు కుండబద్దలు కొట్టారు. టోర్నీలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ సలహా కోసమే మేము ఎదురుచూస్తున్నాం.
అలా అయితే బహిష్కరిస్తాం
ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటాము. ఒకవేళ వారు మమ్మల్ని వరల్డ్‌కప్ టోర్నీలో ఆడవద్దని చెబితే అలాగే చేస్తాము’’ అని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాదిరే తమకూ వెసలుబాటు కావాలని పాక్ కోరినట్లుగా ఐసీసీ శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది.
అయినప్పటికీ పీసీబీ బంగ్లాదేశ్ విషయంలో రాద్దాంతం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ సైతం పాక్ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ మొండివైఖరి నేపథ్యంలో ఆ జట్టును తప్పించిన ఐసీసీ.. స్కాట్లాండ్‌ను టోర్నీలో చేర్చింది. మొత్తం 20 జట్లు వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొననున్నాయి.


