ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం?: రోహిత్‌ శర్మ | Team India Captain Rohit Sharma Big Statement On India ICC Trophy Drought, Says Our Time Will Come - Sakshi
Sakshi News home page

Rohit Sharma: ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం?.. అదొక్కటి తప్ప అన్నీ గెలిచాం

Jan 27 2024 11:56 AM | Updated on Jan 27 2024 1:17 PM

Our Time Will Come Rohit Sharma Big Statement On India ICC Trophy Drought - Sakshi

రోహిత్‌ శర్మ (PC: BCCI)

Ind vs Eng: గత మూడేళ్లలో తాము అద్భుత ప్రదర్శన కనబరిచామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న మాట నిజమే అయినా.. అంతకుమించి మెరుగైన విజయాలు సాధించామని పేర్కొన్నాడు. సమయం అనుకూలించినపుడు తప్పకుండా ఆ లోటు కూడా తీర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

పదకొండేళ్లుగా నో ట్రోఫీ
కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత జట్టు ఇంత వరకూ ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేదు. గతేడాది రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2021-23, వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ చేరినప్పటికీ ఆఖరి గండాన్ని దాటలేకపోయింది.

అదొక్కటి తప్ప అన్నీ గెలిచాం
ఈ రెండు సందర్భాల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ట్రోఫీలను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌-2024లో గెలిచి ఆ వెలితిని పూడ్చుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌లలో మెరుగ్గా ఆడుతున్నా అసలు సమయం వచ్చేసరికి టీమిండియా చేతులెత్తేయడంతో మాజీ క్రికెటర్లు సహా అభిమానులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్లలో గొప్పగా ఆడాం. ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో గెలవలేదన్న మాటే తప్ప.. అన్నీ గెలిచాం. ఐసీసీ టైటిల్‌ కూడా గెలిచి ఉంటే ఇంకా బాగుండేది.

అయితే, దేనికైనా సమయం రావాలి. గతాన్ని మరిచి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా గతం మారదు కదా. కానీ, భవిష్యత్తు ఎలా ఉండాలో మనం ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా దృష్టి మొత్తం దానిపైనే కేంద్రీకృతమై ఉంది. 

ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం?
మా జట్టుపై భారీ అంచనాలు ఉండటం సహజం. 2019 వరల్డ్‌కప్‌లో నేను ఐదు సెంచరీలు సాధించాను. కానీ మేము ఓడిపోయాం కదా. కాబట్టి ఇక్కడ అంకెలు ప్రామాణికం కాదు. అయితే, ఇక్కడ ఎవరికైనా ఐసీసీ ట్రోఫీలే ముఖ్యం. నేను రిటైర్‌ తర్వాత కూడా ఇదే కోరుకుంటాను. మా జట్టు టైటిల్‌ గెలవాలని ఆశిస్తాను.

ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం... ఆఖరికి మా జట్టు విజేతగా నిలిచిందా లేదా అనేదే ముఖ్యం’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందు జియో సినిమాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి:  బీసీసీఐ, కివీస్‌ బోర్డుల బాటలో వెస్టిండీస్‌.. కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement