
చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన మెక్‌లారెన్ డ్రైవర్
వరుసగా రెండో రేసులోనూ మెక్‌లారెన్ జట్టుకే అగ్రస్థానం
హామిల్టన్, లెక్‌లెర్క్, పియరీ గ్యాస్లీలపై అనర్హత వేటు
ఏప్రిల్ 6న తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి
షాంఘై: గత ఏడాది ఫార్ములావన్ సీజన్ ఆరంభంలో రెడ్‌బుల్ జట్టు అదరగొట్టగా... ఈసారి మెక్‌లారెన్ జట్టు మెరిపిస్తోంది. ఈ సీజన్‌లోని తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ విజేతగా నిలువగా... రెండో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌కే చెందిన రెండో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన 23 ఏళ్ల పియాస్ట్రి రేసు ముగిసే వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు.
నిర్ణీత 56 ల్యాప్‌ల రేసును ఆ్రస్టేలియా జాతీయుడైన పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 30 నిమిషాల 55.026 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించాడు. 2023లో మెక్‌లారెన్ జట్టు తరఫునే ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన పియాస్ట్రి వరుసగా మూడో ఏడాది అదే జట్టుతో ఉన్నాడు. గత ఏడాది హంగేరి గ్రాండ్‌ప్రి, అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న పియాస్ట్రి తాజా గెలుపుతో తన కెరీర్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు.
మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు. నోరిస్ 1 గంట 31 నిమిషాల 04.774 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఫార్ములావన్ రేసులో ఓవరాల్‌గా 1–2 స్థానాలు మెక్‌లారెన్ డ్రైవర్లే సొంతం చేసుకోవడం ఇది 50వ సారి కావడం విశేషం. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానంలో నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఆ ముగ్గురిపై వేటు
ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్‌లెర్క్, లూయిస్ హామిల్టన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా... పియరీ గ్యాస్లీ (ఆలై్పన్) 11వ స్థానంలో నిలిచారు. అయితే సాంకేతిక కారణాలరీత్యా రేసు ముగిశాక ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. లెక్‌లెర్క్ 10 పాయింట్లను, హామిల్టన్ 8 పాయింట్లను చేజార్చుకున్నారు. 11వ స్థానంలో నిలిచినందుకు గ్యాస్లీకి ఎలాంటి పాయింట్లు లభించలేదు. ఫార్ములావన్ నిబంధనల ప్రకారం రేసు ముగిసిన తర్వాత డ్రైవర్ల కారు కనిష్ట బరువు 800 కేజీలు ఉండాలి.

అయితే లెక్‌లెర్క్, హామిల్టన్, గ్యాస్లీల కార్ల బరువు 799 కేజీలు చూపించింది. దాంతో ఈ ముగ్గురిపై రేసు నిర్వాహకులు వేటు వేసి వారి ఫలితాలను రద్దు చేశారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 6న సుజుకా సర్క్యూట్‌లో జరుగుతుంది. సీజన్‌లోని తొలి రెండు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో లాండో నోరిస్ 44 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో, 35 పాయింట్లతో జార్జి రసెల్ మూడో స్థానంలో నిలిచారు. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెక్‌లారెన్ 78 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.