
లండన్: ఒక దిగ్గజ ప్లేయర్‌తో మరో మాజీ వరల్డ్ నంబర్‌వన్ కోచింగ్ అనుబంధం ఆరు నెలలకే ముగిసింది. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కోచ్, బ్రిటన్ మాజీ ప్లేయర్ ఆండీ ముర్రేతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇకపై వీరిద్దరు కలిసి పని చేయరని ముర్రే మేనేజర్ ప్రకటించాడు. గత ఏడాది ముర్రే ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత తనకు కోచింగ్ సహకారం కావాలంటూ జొకోవిచ్ స్వయంగా ముర్రేను సంప్రదించాడు. దాంతో వీరిద్దరు ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు ముందు జత కట్టారు.
అయితే ఇది ఎక్కువ కాలం సాగలేదు. తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేక వరుసగా ఓడుతున్న జొకోవిచ్ ఈ సీజన్‌లో ఇంకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. నిజానికి రాబోయే క్లే కోర్టు సీజన్ ముగిసే వరకు కూడా తనకు ముర్రే కోచ్‌గా వ్యవహరిస్తాడని గతంలోనే జొకోవిచ్ చెప్పినా... చివరకు దానికి చాలా ముందే ఇద్దరూ విడిపోయారు. ‘గత ఆరు నెలలుగా నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. కోర్టులో కఠోర శ్రమతో పాటు కోర్టు బయట కూడా రోజులు బాగా గడిచాయి’ అని జొకోవిచ్ సోషల్ మీడియాలో ముర్రే గురించి పోస్ట్ చేయగా...తనకు కోచ్‌గా అవకాశం ఇచ్చిన జొకోవిచ్‌కు ముర్రే కూడా థ్యాంక్స్ చెప్పాడు.
ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల జొకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తే టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పుతాడు. మహిళల విభాగంలో ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్, జొకోవిచ్ పేరిట సంయుక్తంగా ఈ రికార్డు ఉంది. కెరీర్‌లో 99 సింగిల్స్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ 100వ టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాడు.
తదుపరి ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు జరిగే జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో జొకోవిచ్ గెలిస్తే జిమ్మీ కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత 100 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో క్రీడాకారిడిగా గుర్తింపు పొందుతాడు.