సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027 కోసం ప్రధాన జట్లన్నీ ఇప్పటి నుంచే తమ సన్నాహకాలను మొదలు పెట్టేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు 2023 వరల్డ్‌కప్ రన్నరప్ భారత్ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
గత ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియా.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీవత్స్ గోస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కంటే దక్షిణాఫ్రికానే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.
"నా దృష్టిలో ప్రపంచకప్-2027లో టైటిల్ గెలిచే అవకాశాలు సౌతాఫ్రికాకే ఎక్కువ. సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగడం దక్షిణాఫ్రికాకు బాగా కలిసివచ్చే ఆంశం. ఆ తర్వాతి స్ధానంలో టీమిండియా ఉంటుంది. అదేవిధంగా ఐసీసీ టోర్నీలంటే చెలరేగిపోయే న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం.
వారు కూడా రేసులో ఉంటారు. అంతేకాకుండా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారు ఈ టోర్నీని విజయవంతంగా ముగించాలని పూర్తి పట్టుదలతో ఉంటారు" అని బియాండ్23 క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోస్వామి పేర్కొన్నాడు. అయితే ఆరుసార్లు వన్డే వరల్డ్‌కప్ విజేత అయిన ఆస్ట్రేలియాను గోస్వామి పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.


