
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. ఇప్పటికే యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. టెస్టు తుదిజట్టులో చోటే కరువైన ఆటగాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించాడు.
విదేశీ గడ్డపై గిల్ విఫలం
కాగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడాడు. 35.06 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, సొంతగడ్డపై వైట్ జెర్సీలో రాణిస్తున్న గిల్‌కు విదేశాల్లో రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తంగా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి చెత్త ప్రదర్శ కారణంగా మెల్‌బోర్న్ టెస్టులో ఆడించకుండా యాజమాన్యం వేటు వేసింది కూడా!
తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
అంతకు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ‘‘టెస్టు క్రికెట్‌లో అతడు ఇంకా పూర్తిగా నిలదొక్కుకోనేలేదు.
మరి ఇప్పుడే కెప్టెన్‌గా ఎందుకు? జస్‌ప్రీత్ బుమ్రానే సారథిని చేయాలి. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్‌లలో ఒకరు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాలి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.
కేఎల్ రాహుల్ సరైనోడు
ఇక విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలని చిక్కా ఈ సందర్భంగా సూచించాడు. కోహ్లి వదిలి వెళ్లిన స్థానానికి రాహుల్ మాత్రమే న్యాయం చేయగలగడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు అతడు విలువైన ఆటగాడని.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
కాగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ రక్తంతో నిండిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. అన్నట్లు.. ఇంగ్లండ్ గడ్డ మీద శుబ్‌మన్ గిల్ మూడు టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు!!
చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. రహానే, పుజారా రీ ఎంట్రీ!