రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో బ్లాక్ క్యాప్స్ జట్టు సమం చేసింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పడుతూ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ అజేయ శతకంతో చెలరేగాడు.
117 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. అతడితో విల్ యంగ్ కూడా కీలక నాక్ ఆడాడు. యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా తలా వికెట్ సాధించారు.
రాహుల్ సెంచరీ వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(12) విరోచిత శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరగనుంది.


