ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.
కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), రాహుల్(1) వికెట్లు భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి(53), విరాట్ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు.
ఆ తర్వాత నితీశ్(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు.


