రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్‌కు విల్ యంగ్ (87) సహకరించాడు.
ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్‌ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం తమ బౌలింగ్ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్ ఉంచినా, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్‌ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.
మరిన్ని విషయాలు గిల్ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్ చేసి, రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.
ఫీల్డింగ్ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్‌లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్‌లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్‌లో ఓటమి తప్పదని గిల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్ బౌలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది.


