
రెండు విభాగాల్లో టాప్–3లో నిలిచిన తెలంగాణ అథ్లెట్
భువనేశ్వర్: వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి నిత్య గంధె ఆకట్టుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన నిత్య... 200 మీటర్ల విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 100 మీటర్ల ఫైనల్ రేసును నిత్య 11.70 సెకన్లలో ముగించింది. అభినయ (భారత్) 11.57 సెకన్లతో అగ్రస్థానంలో నిలువగా... స్నేహ (భారత్) 11.70 సెకన్లతో రెండో స్థానాన్ని సంపాదించింది.
నిత్య, స్నేహ ఒకే సమయం నమోదు చేసినా ఫొటో ఫినిష్ ద్వారా స్నేహకు రెండో స్థానాన్ని ఖరారు చేశారు. 200 మీటర్ల ఫైనల్ రేసును నిత్య 24.11 సెకన్లలో పూర్తి చేసింది. ఏంజెల్ సిల్వియా (భారత్; 23.95 సెకన్లు) తొలి స్థానంలో, ఉన్నతి అయ్యప్ప (భారత్) 24.56 సెకన్లు మూడో స్థానంలో నిలిచారు. కాంటినెంటల్ టూర్ మీట్‌లలో విజేతలకు పతకాలకు బదులుగా ప్రైజ్‌మనీ చెక్‌లు అందజేశారు.
తొలి స్థానం పొందిన వారికి 800 డాలర్లు (రూ. 70 వేలు), రెండో స్థానం దక్కించుకున్న వారికి 400 డాలర్లు (రూ. 35 వేలు), మూడో స్థానంలో నిలిచిన వారికి 300 డాలర్లు (రూ. 26 వేలు), నాలుగో స్థానం సంపాదించిన వారికి 200 డాలర్ల (రూ.17 వేలు) చొప్పున ప్రదానం చేశారు.
పురుషుల 200 మీటర్లలో అనికుశ్ కుజుర్ (భారత్; 20.77 సెకన్లు)... లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ (భారత్; 8.13 మీటర్లు), ట్రిపుల్ జంప్‌లో అబుబాకర్ (భారత్; 16.53 మీటర్లు).. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (భారత్; 62.01 మీటర్లు)... లాంగ్‌జంప్‌లో శైలి సింగ్ (భారత్; 6.28 మీటర్లు) అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.