టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సారథిగా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్. మైదానంలో ప్రశాంతంగా ఉంటూనే ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేసిన ఘనత ఈ ‘మిస్టర్ కూల్’ సొంతం.
అయితే, ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. రికార్డుల కోసం మాత్రం ఎప్పుడూ ఆడలేదు. ముఖ్యంగా వంద టెస్టులకు చేరవవుతున్న వేళ అకస్మాత్తుగా ఈ దిగ్గజ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
అవకాశం ఉన్నా..
ఆస్ట్రేలియాతో 2014-15లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో మూడో టెస్టు తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికి మొత్తంగా కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన ధోని.. 4876 పరుగులు సాధించాడు. ఇంకొంత కాలం వేచి ఉంటే.. 100 టెస్టుల మైలురాయిని చేరడంతో పాటు.. ఐదు వేల పరుగుల మార్కు అందుకునే అవకాశం నాడు ధోనికి ఉంది.
కానీ అతడు జిడ్డులా పట్టుకుని వేలాడలేదు. తన రిటైర్మెంట్‌కు అదే సరైన సందర్భమని భావించి హుందాగా తప్పుకొన్నాడు. అయితే, కెరీర్‌ను పొడిగించుకునే అవకాశం ఉన్నా వదులుకునే వాళ్లు కొంతమందే ఉంటారని.. అందులో ధోని ముందు వరుసలో ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
ధోని నుంచి నేర్చుకోవాల్సిన జీవితం పాఠం
ఈ మేరకు.. ‘‘జీవితంలో నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే, ధోని గురించి తెలుసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైన విషయం అని నేను చెప్పగలను. మనకు ఏదైనా లభిస్తే.. దానిని పట్టుకుని ఉండటం సులువే.
ఒకవేళ మన వల్ల ఇక కుదరని తెలిసినా దానినే పట్టుకుని జిడ్డులా వేలాడుతూనే ఉన్నామనుకోండి.. అది జరగదని తెలిసినా వదిలివేయబుద్ధికాదు. కానీ కొంతమంది తమకు ఆ విషయాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా సులువుగా దానిని వదులుకుంటారు.
సూపర్‌స్టార్ అయినా..
ముఖ్యంగా సూపర్‌స్టార్లుగా ఉన్న వ్యక్తులు అంత తేలికగా దేనినీ వదులుకోలేరు. కానీ ధోని అలా కాదు. అతడు దేనినైనా సులువుగా త్యజించగలడు. నాడు అతడు టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడిని ఎవరూ ఏమీ అనలేదు. అప్పుడతడు అంతటి పటిష్ట స్థితిలో ఉన్నాడు.
అయినా సరే సిరీస్ మధ్యలోనే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది వదిలేస్తున్నా’ అని ప్రకటించాడు. అతడు 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇంచుమించుగా ఐదు వేల టెస్టు పరుగులకు దగ్గరగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు మైలురాళ్ల గురించి ఆలోచించలేదు.
తనకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రయోజనం లేదనుకుంటే ఏ విషయాన్నైనా పొడిగించడం సరికాదనే సందేశాన్ని ఇచ్చాడని తన ఫాలోవర్లతో పేర్కొన్నాడు.
దిగ్గజ సారథి
కాగా 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 10773, టెస్టుల్లో 4876, టీ20లలో 1617 పరుగులు సాధించాడు.
సారథిగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 టైటిళ్లు గెలిచిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.


