
పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త ప్రదర్శనలను కొనసాగిస్తుంది. ఈ పర్యటనలో తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న పాక్.. ఇప్పటివరకు పూర్తయిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో గల్లీ జట్ల కంటే ఘోరంగా ఆడిన పాక్.. మరోసారి తమ చెత్త ప్రదర్శనను రిపీట్ చేసింది.
వెల్లింగ్టన్ వేదికగా ఇవాళ (మార్చి 26) జరుగుతున్న నామమాత్రపు ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద 128 పరుగులు చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సల్మాన్ అఘా (39 బంతుల్లో 51) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఇద్దరు (మహ్మద్ హ్యారిస్ (11), షాదాబ్ ఖాన్ (28)) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు.
మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హసన్ నవాజ్, సూఫియాన్ ముఖీమ్ ఖాతా కూడా తెరవలేకపోగా.. ఒమైర్ యూసఫ్ 7, ఉస్మాన్ ఖాన్ 7, అబ్దుల్ సమద్ 4, జహందాద్ ఖాన్ 1 పరుగు చేశారు. హరీస్ రౌఫ్ 6, మహ్మద్ అలీ 0 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఐదేసిన నీషమ్
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. తన కోటా 4 ఓవర్లలో నీషమ్ కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జేకబ్ డఫీ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. బెన్ సియర్స్, ఐష్ సోధి తలో 4 ఓవర్లలో వరుసగా 25, 32 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
విరుచుకుపడుతున్న ఓపెనర్లు
129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ విరుచుకుపడుతున్నారు. వీరిద్దరు తొలి మూడు ఓవర్లలోనే 45 పరుగులు పిండుకున్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 84 పరుగులు మాత్రమే కావాలి.
ఇదివరకే సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1, 2, 4 టీ20లు గెలిచిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. ఈ మ్యాచ్ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే మార్చి 29న నేపియర్ వేదికగా జరుగనుంది.